భక్త జన జాతర
భక్తుల సౌకర్యాలపై
ప్రత్యేక దృష్టి
చిన్న తిరునాళ్ల ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు, ప్రసాదాల కౌంటర్లు, బస్టాండ్ ఏర్పాట్లు ఆలయ ఇంజినీరింగ్ అధికారుల ద్వారా చేస్తున్నాం. మునేరులో షవర్‌బాత్‌లు, తలనీలాలు తీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరగనున్నాయి.
–బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్, ఆలయ ఈఓ
ఉత్సవాల విజయవంతానికి సహకరించాలి
అమ్మవారి చిన్నతిరునాళ్ల మహోత్సవాన్ని భక్తులతో పాటు గ్రామస్తులు, అధికారులు సహకరించి విజయవంతం చేయాలి. తిరునాళ్ల ఐదు రోజుల పాటు ఆలయం వద్ద రాత్రి సమయంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం.
–జంగాల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్
పెనుగంచిప్రోలు: రాష్ట్ర ప్రజలతో విశేష పూజలందుకుంటున్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 14 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తిరునాళ్ల మహోత్సవాలు జరిగే ఐదు రోజులు, ఒక్కో రోజు ఒక్కో ఉత్సవం కనుల పండువగా జరగనుంది. ఉత్సవాల్లో అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు–కుంకుమల బండ్లు రాక ప్రధాన ఘట్టంగా ఉంటుంది. తిరునాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తారు.
ఇవీ ఏర్పాట్లు...
మునేరులో జల్లు స్నానాలు, పలు చోట్ల భక్తుల సౌకర్యార్ధం చేతి పంపులు, శుద్ధి చేసిన తాగు నీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు వసతి కోసం పలుచోట్ల షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.
అఖండ జ్యోతి స్థాపనతో తిరునాళ్ల ప్రారంభం
చిన్న తిరునాళ్లలో మొదటి రోజు మార్చి 14 న ఉదయం 6–02 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. వేలాదిగా భక్తులు అమ్మవారికి పాలు, పొంగళ్లతో మొక్కులు తీర్చుకుంటారు. నిత్య కల్యాణ మూర్తులకు అభిషేకం ఉంటాయి.
రెండవ రోజు గ్రామోత్సవం
తిరునాళ్లలో రెండవ రోజు మార్చి 15 న రాత్రి 6–56 గంటలకు ఉత్సవమూర్తులను రథంపై ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం (గ్రామోత్సవం) నిర్వహిస్తారు. భక్తులు వేలాదిగా పాల్గొంటారు.
మూడవ రోజు దివ్య ప్రభోత్సవం
మూడవ రోజు మార్చి 16 న రాత్రి 9–05 గంటలకు దివ్య ప్రభోత్సవం వైభవంగా జరగనుంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ఉత్సవంలో సుమారు 90 అడుగుల దివ్యప్రభపై ఉత్సవమూర్తులను ఉంచి ప్రభను ఎడ్లు లాగుతూ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ అపురూప దృశ్యాన్ని చూడటానికి మండల ప్రజలే కాక పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
నాల్గవరోజు అమ్మవారి పుట్టింటి
పసుపు–కుంకుమలు
చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లు తిరునాళ్ల నాల్గవ రోజున మార్చి 17న అనిగండ్లపాడు గ్రామం నుంచి సాయంత్రం 4–53 గంటలకు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి పుట్టింటి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి నుంచి ఏటా పసుపు కుంకుమలు బండ్లపై తీసుకు రావటం ఆనవాయితీగా వస్తోంది. గ్రామానికి చెందిన వారు వందల బండ్లతో పసుపు– కుంకుమ బండి వెంట పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు.
ఐదవ రోజు భక్తుల బోనాల సమర్పణ
ఐదవరోజు మార్చి 18 న ఉదయం 5–30 గంటలకు భక్తులు బోనాల సమర్పణతో చిన్న తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి.
ఐదు రోజులు జరిగే ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు మార్చి 14 నుంచి ఉత్సవాలు ప్రారంభం మార్చి 17 న అమ్మవారి పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లు రాక
భక్త జన జాతర
భక్త జన జాతర
భక్త జన జాతర
Comments
Please login to add a commentAdd a comment