నేడు సామూహిక ఎలుకల నిర్మూలన
పోస్టర్లను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని వరి సాగు చేసే గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఎలుకల యాజమాన్యం (రబీ 2025)పై రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొలాలు, గట్లపై సజీవ ఎలుక బొరియలను గుర్తించి, వాటిలో బ్రోమోడయోలోన్ మందు కలిపిన ఎరను 10 గ్రాములు చొప్పున వేసి మూసేయాల్సి ఉంటుందని వివరించారు. బ్రోమోడయోలోన్ ఎలుకల మందు కలిపిన ఎరను రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) నుంచి ఉచితంగా పొందొచ్చన్నారు. పంటను కాపాడుకోవాలంటే ఒకేసారి అన్ని పొలాల్లోనూ సామూహిక ఎలుకల నిర్మూలన జరగాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment