వరిపై వేటు
చెరువుతో చేటు..
కవులూరు శివారులో అనుమతులు లేకుండా తవ్వుతున్న చేపల చెరువులు
జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లాల్లో చేపల చెరువులు వేగంగా విస్తరిస్తున్నాయి. వరి సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధిక లీజు ఆశ చూపుతుండడంతో రైతులు సాగు భూములను చేపల చెరువుల నిర్వహణకు ఇస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ చెరువులు, కాలువలను ఆనుకుని ఉన్న వందల ఎకరాల వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని చెరువులు తవ్వుతున్నారు. ఈ చెరువుల తవ్వకానికి వివిధ శాఖల నుంచి అనుమతులు అవసరం. అయితే ఆ అనుమతుల కోసం కనీసం దరఖాస్తు కూడా చేయకుండా చెరువులను తవ్వేస్తున్నారు. ఇరిగేషన్ చెరువులు, పంట కాలువల్లో నీటినే చెరువులకు మళ్లించి చేపలను పెంచుతున్నారు. ఫలితంగా ఆయా చెరువులు, కాలువల కింద వరి సాగు చేస్తున్న భూములకు సాగునీటి సమస్య తలెత్తుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో విస్తరిస్తున్న చెరువులు
ఎన్టీఆర్ జిల్లాలో 13 మండలాల పరిధిలోని 22 గ్రామాల్లో 945.79 ఎకరాల విస్తీర్ణంలో 269 చెరువులను నిర్వహిస్తున్నారు. ఏడాదికి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ చెరువుల నుంచి రెండు విడతలు కలిపి 1500 టన్నులకు పైగా చేపల ఉత్పత్తి జరుగు తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 364 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. 581 ఎకరాల విస్తీర్ణంలో చెరువులు అక్రమంగా సాగవుతున్నాయి.
కవులూరులో..
జిల్లాలోని జి.కొండూరు మండల పరిధిలో అత్యధికంగా 238 ఎకరాల్లో 67 చెరువులను తవ్వారు. కవులూరు గ్రామ పరిధిలోనే 155.5 ఎకరాల విస్తీర్ణంలో 39 చెరువులు ఉన్నాయి. ఇక్కడ అనుమతులు లేకుండా కొత్తగా చెరువులు తవ్వుతున్నారు. గ్రామ శివారులో తొమ్మండ్రంవాగు, గుర్రాలవాగు ముంపు భూములు 150 ఎకరాల వరకు ఉండగా దీనిలో కొంత మేర రైతులు చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. ఈ చెరువుల తవ్వకం వల్ల మిగిలిన సాగుభూమి కూడా ముంపునకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఆ భూముల రైతులు కూడా చేసేదేమీలేక చేపల చెరువులకు లీజుకిస్తున్నారు. ఏడాదికి ఎకరాకు రూ.50 వేల వరకు లీజు ఇస్తున్న క్రమంలో రైతులు చెరువులకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో చేపల చెరువులు వేగంగా విస్తరిస్తున్నాయి. కవులూరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువు, తారకరామ ఎడమ, కుడి కాలువల్లో నీటినే ఈ చెరువులకు వినియోగిస్తున్నారు. దీనిపై ఆ గ్రామంలో సాగు చేస్తున్న రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
యథేచ్ఛగా అక్రమంగా చేపల చెరువుల తవ్వకం ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తరిస్తున్న చేపల చెరువులు ఇరిగేషన్ చెరువులు, కాలువల జలాలు చేపల చెరువులకు మళ్లింపు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
ఎన్టీఆర్ జిల్లాలో చేపల చెరువుల వివరాలు
ఇలా అనుమతులు పొందాలి
చేపల చెరువు అనుమతి కోసం మొదట భూమి పత్రాలు, ఆధార్‌కార్డు, ఇతర వివరాలతో ఈ–మత్స్యకార యాప్‌లో దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తును గ్రామ మత్స్యశాఖ అసిస్టెంట్ పరిశీలించి మండల కమిటీకి పంపుతారు. మండల కమిటీలో చైర్మన్‌గా ఉన్న తహసీల్దార్ భూమి వివాదాలను పరిశీలించి క్లియరెన్స్ ఇస్తారు. మండల వ్యవసాయాధికారి నుంచి చెరువు తవ్వుతున్న భూమి సారవంతం లేనందున లేక ముంపు లేక మరే ఇతర కారణాల వల్ల సాగుకు అనుకూలంగా లేనందునే చెరువులు తవ్వుతున్నట్లు అనుమతి పొందాలి. ఈ చెరువులకు సరిపడా నీటి వసతి కోసం సరిపడా భూగర్భజలాలు అందుబాటులో ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి పొందాలి. చెరువు తవ్వకం వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి పొందాలి. మండల కమిటీలో దరఖాస్తు ఆమోదంపొందిన తర్వాత ఈ దరఖాస్తును జిల్లా కమిటీకి పంపుతారు. మండల కమిటీలో వివిధ శాఖల అధికారులు తెలిపిన ఆమోదాన్ని పరిశీలించిన జిల్లా కమిటీ, దరఖాస్తు దారుడు చెరువు తవ్వకానికి అర్హుడని భావిస్తే జిల్లా కమిటీ కూడా ఆమోదిస్తుంది. ఈ రెండు కమిటీలు ఆమోదం తెలిపిన తర్వాత చెరువుల తవ్వకానికి దరఖాస్తుదారుడు అక్వాకల్చర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను పొందుతాడు.
అనుమతులు పొందాల్సిందే...
చేపల చెరువులు తవ్వాలంటే అన్ని అనుమతులు ఉండాల్సిందే. ఇప్పటికే అనుమతులు లేకుండా తవ్విన చెరువులు నిబంధనలకు లోబడి ఉంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేలా అవగా హన కల్పిస్తున్నాం. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్విన చెరువులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ధ్వంసం చేసేందుకు కూడా వెనుకాడం. జిల్లాలో రీసర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్‌తో ఆక్వాకల్చర్ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
– సీహెచ్ సౌభాగ్యచక్రాణి, ఎన్టీఆర్ జిల్లా మత్స్య శాఖ అధికారి
వరిపై వేటు
వరిపై వేటు
Comments
Please login to add a commentAdd a comment