చురుగ్గా.. పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

చురుగ్గా.. పునరుద్ధరణ

Published Mon, Jun 5 2023 7:46 AM | Last Updated on Mon, Jun 5 2023 10:52 AM

- - Sakshi

భువనేశ్వర్‌: బహనాగా బజార్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రత్యక్షంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మృతదేహాల తరలింపునకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ నేపథ్యంలో సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఉచిత బస్సు రవాణా సదుపాయం కల్పించింది. మృతులు, క్షతగాత్రులకు పరిహారం చెల్లింపు చర్యలు చురుగ్గా సాగుతున్నాయి.

లెక్క తేలింది..
రైల్వేశాఖ సమాచారం ఆధారంగా కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య శనివారం రాత్రి 288గా ప్రకటించారు. దుర్ఘటనకు గురైన చిట్టచివరి బోగీ పునరుద్ధరించిన తర్వాత లెక్కించిన మేరకు తుది వివరాలను దాఖలు చేసినట్లు రైల్వేశాఖ పేర్కొంది. అయితే ఆదివారం ఉదయం వరకు అంచెలంచెలుగా అందిన మృతదేహాలను ఒకటికి రెండు సార్లు లెక్కించడంతో మృతుల సంఖ్య 261గా ప్రకటించాం. రైల్వేశాఖ మృతుల సంఖ్య 288గా పేర్కొనడంతో రాష్ట్రప్రభుత్వం ఇదే సంఖ్యను ప్రకటించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ జెనా స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో ఒక్కో మృతదేహం రెండుసార్లు చొప్పన లెక్కించడంతో గణాంకాల్లో గందరగోళం చోటు చేసుకుందని వివరించారు.

ఆస్పత్రులకు మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన మేరకు లెక్కించడంతో తాజా మృతుల సంఖ్య 275గా తేలిందన్నారు. జిల్లా కలెక్టర్‌ లిఖితపూర్వకంగా ఈ సంఖ్యని ధ్రువీకరించారని తెలిపారు. ఇక మృతుల సంఖ్యలో తేడాలు చోటు చేసుకునే అవకాశం లేదన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయి.. మృతదేహాలు, బాధితుల గుర్తింపు ముగిసినందున ఇకపై వ్యత్యాసం ఉండదని వివరించారు. అలాగే ఆదివారం సాయంత్రానికి 78 మృతదేహాలను బంధువులకు అప్పగించడం పూర్తయ్యిందని సీఎస్‌ వెల్లడించారు. మరో 10 మృతదేహాల గుర్తించామని, అప్పగింత ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ లెక్కన సమగ్రంగా 88 మృతదేహాలను గుర్తించగా.. 17 మృతదేహాలు బాలాసోర్‌కు, మిగిలిన వాటిని భువనేశ్వర్‌లోని మార్చరీకి తరలించినట్లు ప్రకటించారు.

రాయగడ: బహనాగా బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి బీజేడీ జిల్లా శ్రేణులు శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలోని గాంధీపార్క్‌ వద్ద శనినవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రి జగన్నాథ సరక, బీజేడీ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌ దాస్‌, ఎస్‌డీసీ చైర్‌పర్సన్‌ అనసూయ మాఝి తదితరులు పాల్గొన్నారను. ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించారు. యువ, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న బాధిత ప్రయాణీకుల పూర్తి వివారలను అందుబాటులోకి తెచ్చారు. పలు వెబ్‌సైట్‌లలో వీటిని అప్‌లోడ్‌ చేశారు. వివరాలతో బాధితుల ఫొటోల్ని జోడించడం విశేషం. ఈ వివరాల వినియోగం పట్ల ప్రత్యేక ఆంక్షలు విధించారు. srcodisha.nic.in, bmc. gov.in అలాగే osdma.org వెబ్‌సైట్‌లో ఫొటోలు, ప్రాథమిక వివరాలు పొందుపరిచారు.

ఆంక్షలు..
వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన బాలాసోర్‌ రైలు ప్రమాదంలో మృతుల ఫొటోలు బంధువర్గాలు గుర్తించేందుకు మాత్రమే పరిమితం. ప్రమాదంలో తీవ్రత దృష్ట్యా పోస్ట్‌ చేసిన చిత్రాలు కలవర పరుస్తున్నాయి. పిల్లలు ఈ చిత్రాలను చూడకుండా నివారించాలని ఆంక్షలు జారీ చేశారు. ఈ సమాచారం వినియోగంలో వీక్షకులు విచక్షణతో సద్వినియోగ పరచుకోవాలి. రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్‌(ఎస్‌ఆర్‌సి) ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా మీడియా/వ్యక్తిగతం/సంస్థలు మొదలైనవి వెబ్‌సైట్‌లో ఈ చిత్రాల ప్రచురణ తదితర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు.

బీఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌–1929
ఈ దిగువ ప్రాంతాల ప్రవేశ ద్వారాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

● కటక్‌ రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎస్‌సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రి.

● భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌, బరముండా బస్‌స్టాండ్‌, విమానాశ్రయం.

కంట్రోల్‌ రూమ్‌

భువనేశ్వర్‌ మున్సిపల్‌ కమిషనర్‌(బీఎంసీ) కార్యాలయం ప్రాంగణంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. బాధితుల బంధువర్గాలు ఆస్పత్రి లేదా మార్చురీకి వెళ్లేందుకు సహాయ సహకారాలు అందజేయడంలో ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. ఈ సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించారు.

ప్రత్యేక రైలు..
12841 అప్‌ షాలీమార్‌–చైన్నె కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో మధ్యాహ్నం 1 గంటకు భద్రక్‌ నుంచి చైన్నెకి ప్రత్యేక రైలు బయల్దేరింది. ఇది కటక్‌, భువనేశ్వర్‌ ఖుర్దారోడ్‌ మీదుగా నడుస్తుంది. ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు, బంధువులు ఈ రైలు సేవను పొందవచ్చని రైల్వేమంత్రి వైష్ణవ్‌ తెలిపారు. ఘటనా స్థలం పునరుద్ధరణ పనుల్లో 1000మంది సిబ్బంది అవిశ్రాంతంగా పని చేస్తున్నారని, 7 పొక్లెయినర్‌లు, 2 యాక్సిడెంట్‌ రిలీఫ్‌ రైళ్లు, 4 రైల్వే, రోడ్‌ క్రేన్‌లు పునరుద్ధరణ పనుల్లో వినియోగిస్తున్నట్లు వివరించారు.

భద్రంగా తరలింపు..
దుర్ఘటనలో దుర్మరణం పాలైన మృతదేహాలను గౌరవ ప్రదంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎస్‌ ప్రదీప్‌ జెనా తెలిపారు. ఘటనా స్థలం నుంచి పలు చోట్ల అందుబాటులో ఉన్న శవాగారాలకు తరలించడంలో అందుబాటులో ఉన్న మాధ్యమాలను పరిశీలించిన మేరకు అంబులెన్సుల్లో తరలించడం శ్రేయోదాయకంగా భావిస్తున్నామన్నారు. ట్రక్కులు లేదా ప్రత్యేక రైలు ద్వారా తరలించేందుకు సైతం యోచిస్తున్నామని ప్రకటించారు. రైలులో రవాణాకు కేబినెట్‌ కార్యదర్శి అనుమతి లభించిందని, అయితే గౌరవప్రదంగా ఉండదని భావించి అంబులెన్సుల్లో తరలించామన్నారు. ఒక్కో అంబులెన్స్‌లో 2చొప్పున 85 వాహనాల్లో భువనేశ్వర్‌కు చేరవేశామని వివరించారు.

రూ.3.22 కోట్ల పరిహారం చెల్లింపు
బాధితులు, కుటుంబాలకు ముందుగా ప్రకటించిన పరిహారం వెంటనే అందేలా చర్యలు చేపడుతున్నామని రైల్వేమంత్రి హామీ ఇచ్చారు. మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాల బాధితులకు రూ.50వేలు చొప్పున చెల్లింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రైల్వేశాఖ 285 కేసుల్లో రూ.3.22 కోట్లు చెల్లించింది. ఇందులో 11 మరణాలు, 50 తీవ్రమైన గాయాలు, 224 సాధారణ గాయాల బాధితులు ఉన్నారు. సొరో, ఖరగ్‌పూర్‌, బాలాసోర్‌, ఖంటపడా, భద్రక్‌, కటక్‌, భువనేశ్వర్‌ తదితర 7 ప్రాంతాల్లో చెల్లింపులకు ప్రత్యేక కేంద్రాలు పని చేస్తున్నాయి.

మృతులకు రూ.5 లక్షలు: సీఎం
దుర్ఘటనలో దుర్మరణం పాలైన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబీకులకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. వీటిని వీలయినంత త్వరలో బాధిత కుటుంబాలకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే పంపిణీ చేసేందుకు యోచిస్తున్నారు.

ప్రధానితో మాటామంతీ..
ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్‌లో మాట్లాడి, తాజా పరిస్థితులు రైలు ప్రమాద బాధితుల చికిత్స గురించి వివరించారు. గాయపడిన ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు వివిధ ఆస్పత్రుల్లో అన్ని చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చారు. వైద్యులు, వైద్య విద్యార్థులు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు తమవంతు కృషి చేస్తున్నారని తెలిపారు. గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు వైద్యులు, విద్యార్థులు, సామాన్యులు ముందుకు వస్తున్నారని ప్రధానికి వివరించారు.

కొరాపుట్‌: బాలేశ్వర్‌ రైలు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్‌, మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు అక్కడే మకాం వేశారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణలో ఉన్న అత్యంత నాణ్యమైన టెక్నాలజీ వినియోగించారు. వందల సంఖ్యలో రైల్వే కార్మికులు షిఫ్ట్‌ల వారీగా పనులు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరూ మంత్రులు భద్రక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రతాప్‌ జెన్నా మీడియా మాట్లాడుతూ మెత్తం 275మంది మృతులు తుది ప్రకటన చేశారు. ప్రతి మృతదేహాన్ని రాష్ట్ర ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు. బంధువులకు అప్పగించని మృతదేహాలను అన్ని ఆస్పత్రుల నుంచి భువనేశ్వర్‌కు రప్పిస్తున్నామన్నాని తెలిపారు. ఏ రాష్ట్రానికి చెందిన మృతులు ఉన్నా.. వారి బంధువులు వస్తే డెత్‌ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. మృతదేహాలను ఫొటోలు తీసి, ప్రదర్శనగా ఉంచారు. బాధిత కుటుంబం సభ్యులు ఫొటో గుర్తించిన వెంటనే అధికారులు ఆ ఫొటో నంబర్‌ చూసి బాధితులను మృతదేహం ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నారు. వెనువెంటనే తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు.

అందుకే.. అంత వేగంగా..
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్‌ పనితీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి విశ్రాంతి లేకుండా అక్కడే మకాం వేశారు. పగలు, రాత్రీ తేడా లేకుండా పరుగులు పెడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయాన రైల్వేమంత్రే ఘటన స్థలంలో తిష్ట వేయడంతో ఆ శాఖలో ఉన్నతాధికారులెవరూ అక్కడి నుంచి కదల్లేకపోయారు. ఈ నేపథ్యంలో శిథిలమైన బోగీలులను తరచూ సందర్శిస్తూ, ట్రాక్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయిస్తున్నారు. మరోవైపు మృతదేహాల తరలింపు పూర్తయినప్పటికీ కొన్ని బోగీల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో పూర్తిస్థాయిలో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో అందరి మన్ననలు పొందిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు చెట్ల కిందే సేద తీరుతున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచి పోవడంతో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నయక్‌ ఉచిత బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి ఈ పరిహరాన్ని బస్సు యజమానులకు చెల్లిస్తామన్నారు. ఈ బస్సులు బాలేశ్వర్‌, పూరీ, కోల్‌కతా, భువనేశ్వర్‌, కటక్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి.

76బస్సుల్లో 3,800మంది..
దుర్ఘటన కారణంగా రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పూరీ, భువనేశ్వర్‌, కటక్‌ నుంచి కోల్‌కతాకు ఉచిత బస్సు సేవలను ప్రకటించారు. మొత్తం ఖర్చు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భరించనున్నారు. అలాగే బాలేశ్వర్‌ మార్గంలో సాధారణ రైలు సేవలను పునరుద్ధరించే వరకు ఈ సౌకర్యం కొనసాగుతుంది. ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేసేందుకు కటక్‌ నుంచి చండీఖోల్‌, భద్రక్‌, బాలాసోర్‌ వరకు ఉచిత బస్సు సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 76బస్సుల్లో సుమారు 3,800మంది ప్రభావిత ప్రయాణికులను కటక్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించారు.

 నేటి నుంచి సీఆర్‌ఎస్‌ విచారణ..

బహనాగా బజార్‌ స్టేషన్‌ వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ట్రిపుల్‌ రైలు ప్రమాదంపై రైల్వే భద్రత(ఆగ్నేయ సర్కిల్‌) కమిషనర్‌ సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్నారు. ఖరగ్‌పూర్‌లోని సౌత్‌ ఇనిస్టిట్యూట్‌లో కమిషనర్‌ సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు శాఖాపరమైన విచారణ జరుపుతారని రైల్వేవర్గాలు ఆదివారం తెలిపాయి. షాలీమార్‌–చైన్నె సెంట్రల్‌ కోరమండల్‌(12841) ఎక్స్‌ప్రెస్‌, ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌–హౌరా(12864) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించి సోమవారం ఉదయం 9 గంటలకు విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రైలు వినియోగదారులు, స్థానిక ప్రజా, ఇతర సంస్థలు ప్రమాదానికి సంబంధించిన ఏదైనా సమాచారానికి సంబంధించి కమిషన్‌ ముందు ప్రవేశ పెట్టవచ్చని సూచించారు. ఈ దుర్ఘటనలో 275మంది ప్రయాణికులు మరణించగా, 1,175 మంది గాయపడ్డారు.

ఎస్సీబీని సందర్శించిన కేంద్రమంత్రులు..
రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల చికిత్స, యోగక్షేమాలను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కటక్‌ ఎస్‌సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సీనియర్‌ వైద్యులు, అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు సరైన చికిత్స అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ప్రతి ప్రాణాన్ని రక్షించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ గాయపడిన వారికి చికిత్స చేయడంలో సహాయ పడేందుకు ఢిల్లీలోని మూడు ప్రీమియర్‌ ఆస్పత్రుల నుంచి వైద్య నిపుణులు, అత్యాధునిక పరికరాలు, మందులు తెప్పించామని తెలిపారు. 100మందికి పైగా రోగులకు క్రిటికల్‌ కేర్‌ అవసరమని గుర్తించామన్నారు. అంతకుముందు ఆయన భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ను సందర్శించారు. రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల నిర్వహణ వ్యవస్థను పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement