
కొరాపుట్/జయపురం : భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) పార్టీని కొరాపుట్ జిల్లా నేతలు వీడనున్నారు. ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ కుటుంబం ఆ పార్టీని వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు గిరిధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్ (మిట్టు) న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నుంచి ఓ వీడియో విడుదల చేశారు. తమ కుటుంబం కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన తొలి విడత చర్చలు విజయవంతంగా ముగిశాయన్నారు. గత ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో హైదరాబాద్‌లో గమాంగ్ కుటుంబం ఆ పార్టీలో చేరింది. అదే వేదికపై కొరాపుట్ మాజీ ఎంపీ జయరాం పంగి కూడా కారు ఎక్కారు. ఆ రోజు వీరి చేరికలు దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్ మీద అంచనాలు పెంచాయి.
గిరిధర్ గమాంగ్ తొమ్మిది సార్లు కొరాపుట్ ఎంపీగా, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రతిసారీ కేంద్ర కేబినెట్ మంత్రిగా పని చేశారు. గిరిధర్ భార్య హేమావతి గమాంగ్ కూడా కొరాపుట్ ఎంపీగా పని చేశారు. అటువంటి గమాంగ్ కుటుంబం 2015లో కాంగ్రేస్ పార్టీని వదిలి తొలుత బీజేపీలో చేరారు.ఆ పార్టీ అధికారంలో ఉన్నందున్న గమాంగ్‌ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ చేస్తారనే ప్రచారం జరిగింది. రోజులు గడుస్తున్నా ఎటువంటి పదవి లభించలేదు. దశాబ్దాలుగా పదవుల్లో ఉన్న గమాంగ్‌కు బీజేపీ రుచించలేదు.
ఇదే సమయంలో కేసీఆర్ ఆకర్షించారు. అయితే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ప్రజలు పట్టించుకోలేదు. ఇదే సమయంలో కొరాపుట్ పార్లమెంటరీ స్థానంలో కాంగ్రేస్ పార్టీ వర్గ విబేధాలు గమాంగ్‌కు కలసి వచ్చాయి. తొలి విడత చర్చలలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు చెల్లకుమార్, కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క పాల్గొన్నారు. ఇదే సమయంలో కొరాపుట్ మాజీ ఎంపీ జయరాం పంగి తాను కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చునని ప్రకటించారు. తన తండ్రి, మేనత్త కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పని చేశారని గుర్తు చేశారు.
బిజూ పట్నాయక్ ఆశయాలతో బీజేడీలో పని చేసినట్లు తెలిపారు. అనేకసార్లు పొట్టంగి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కొరాపుట్ ఎంపీగా పని చేశానన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేడీలో చేరనన్నారు. మరోవైపు జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీనీ పతి మాట్లాడుతూ గమాంగ్ కుటుంబం ఎనిమిదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలోనికి వస్తుండం హర్షనీయమన్నారు. తాము గతంలో శత్రువులైనప్పటికీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే కొరాపుట్, రాయగడ జిల్లాల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అయినట్లే.
Comments
Please login to add a commentAdd a comment