ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం
భువనేశ్వర్: ప్రభుత్వ శాఖల పనితీరు, పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనా సమీక్షించారు. స్థానిక ఖారవేళ భవన్‌లో ఆయన అధ్యక్షతన ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సమావేశం గురువారం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వివిధ శాఖలు సాధించిన ఫలితాలను ఈ సమావేశంలో సమీక్షించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సమగ్ర రాష్ట్ర ప్రభుత్వం, శాఖలవారీ పని తీరుని క్షుణ్ణంగా విశ్లేషించారు. ప్రధానంగా జిల్లా మినరల్ నిధి (డీఎంఎఫ్) వ్యయ విధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులో 34.87 శాతం నిధులు వెచ్చించారు. గతేడాది ఈ సమయానికి బడ్జెటు నిధుల వినియోగం 25.61 శాతానికి పరిమితమైనట్లు సమీక్షలో తేటతెల్లమయ్యింది. మత్స్య మరియు పశు వనరుల విభాగం (ఏఆర్డీ) గత సంవత్సరం కంటే ఈ ఏడాది బడ్జెటు నిధుల సద్వినియోగంలో 158 శాతం వృద్ధిని సాధించింది. మౌలి క సౌకర్యాల రంగంలో (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) విద్యుత్ శాఖ గతేడాది కంటే అత్యధికంగా 2400 శాతం వృద్ధిని సాధించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం స్వంత పన్నుల ఆదాయం గణనీయంగా పుంజుకుంది. గతేడాది కంటే 14.59 శాతం అధిక ఆదాయం నమోదైనట్లు సమీక్ష సమావేశంలో గుర్తించారు. 2023–24 ఆర్థిక సంవత్సరపు అనుబంధ బడ్జెట్ వ్యయ మంజూరి ప్రతిపాదనలను శాసన సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో బడ్జెటు కేటాయింపులను సకాలంలో సద్వినియోగపరచుకోవడంలో అన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని చీఫ్ సెక్రటరీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment