అడవుల సంరక్షణకు బైక్ ర్యాలీ
రాయగడ: పర్యావరణ పరిరక్షణతో పాటు అడవుల ఆవశ్యకత తెలియజేసేందుకు జిల్లాలోని మునిగుడలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కొంతమంది అవగాహన రాహిత్యంతో అడవులకు నిప్పుపెడితే పర్యావరణానికి పెనుముప్పు వాటిళ్లుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామాల్లోని ప్రజలకు చైతన్యం కలిగించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామని మునిగుడ రేంజర్ అనిల్ కుమార్ బాల, పర్యావరణ ప్రేమికుడు గౌరంగ చరణ్ రౌత్ తెలియజేశారు. రేంజ్ పరిధిలోని బైరగుడ, కుముడాబల్లి, మేరింగి, తులసీపొదొరొ, కొరామోహన, డెప్పాగుడి, తారాబడి, తెలెంగపొదొరొ తదితర గ్రామాల్లో ఈ ర్యాలీ కొనసాగింది.
రాగుల మండీ పరిశీలన
జయపురం: సబ్ డివిజన్ కుంద్రలో ఏర్పాటు చేసిన రాగుల మండీని కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తివాసన్ సోమవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా మండీలో కొనుగోలు చేసిన రాగుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం మండీల్లో సౌకర్యాలు, సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. అలాగే మండీకి రాగులు తీసుకొచ్చిన మహిళా రైతులతో మాట్లాడి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. రాగులు నిల్వ చేసేందుకు గిడ్డంగి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు సబ్ కలెక్టర్ ఎ.శొశ్య రెడ్డి తదితరులు ఉన్నారు.
అటవీ భూపట్టాలపై అవగాహన
మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి కదంగూడ పంచాయతీలో అటవీ భూపట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా ఆదివాసీ మహాసంఘ అధ్యక్షుడు బంధు ముదిలి, పంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ్ జిగిడీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎఫ్ఆర్ఏ యాక్ట్ 2006 కింద ఆదివాసీల హక్కులపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా గదబా సమాజ్ అధ్యక్షుడు భీష్మ ఖీలో, జిల్లా బోండా సమాజ్ అధ్యక్షుడు ముకుంద మాఝి తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనాల
దొంగలు అరెస్టు
జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంద్రాలో ద్విచక్ర వాహనాల దొంగలు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం ముగ్గురు యువకులు ఒక బైక్‌పై కుంద్రా నుంచి డొంగిరిపంసి వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని ఆపి విచారించారు. దీంతో వారు బైక్‌ను దొంగిలించిన విషయం తెలిపారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా మరో 6 బైక్‌లను సైతం దొంగిలించి వాటిని బొయిపరిగుడ సమితిలోని కదమగుడ, బొడొగుడ గ్రామాల్లో ఉంచినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు కదమగుడ గ్రామంలో 5 బైకులు, బొడొగుడలో ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారని పోలీసు అధికారి చిత్తరంజన్ ప్రధాని తెలియజేశారు. అలాగే బైక్‌లు కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment