మహేంద్రగిరి అభివృద్ధి కమిటీలో చోటేదీ?
పర్లాకిమిడి: మహేంద్రగిరి అభివృద్ధి కమిటీలో కోయిపూర్, బారోఘోరో, లక్ష్మీపూర్, రంప, మాలువ ప్రాంత ప్రజా ప్రతినిధులను కాదని ఇతర ప్రాంతాల వారు కమిటీలో ఉండటంపై ఆదివాసీ మహాసంఘ్ (గజపతి) అధ్యక్షులు నీరో భుయ్యాన్ తప్పుపట్టారు. ఈ మేరకు బుధవారం ఐదు పంచాయతీల ప్రజలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ కమిషనర్(గంజాం)కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల రాష్ట్ర రవాణా, ఖనిజ శాఖా మంత్రి బిభూతి జెన్నా మహేంద్రగిరి పర్యటించిన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఒక ప్రాంతీయ కమిటీ వేశారని, అందులో కోయిపూర్, రాయఘడ సమితి లక్ష్మీపూర్, మాళువ, బారోఘోరో ఆదివాసీలకు చోటు నివ్వకపోవడం తగదన్నారు. మహేంద్రంలో నిర్మించిన ఇతర భవనాలు కూల్చివేయకపోతే, అదే ప్రాంతంలో చెట్లు నరికి తాము కూడా ఇళ్లు నిర్మించుకుంటామని భుయ్యాన్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాయఘడ మాజీ చైర్మన్, జెడ్పీటీసీ ధనేశ్వర భుయ్యాన్, పితాంబర్ నాయక్, జగన్నాథ భుయ్యాన్, మాజీ సర్పంచ్ సన్యాసి కార్జి, రాజేంద్ర భుయ్యాన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment