
హిందూ – ముస్లింలను విడదీసే కుట్ర
● రాజ్యసభ సభ్యుడు మున్నా ఖాన్
కొరాపుట్: దేశంలో హిందూ – ముస్లింలను విడదీసే కుట్ర జరుగుతోందని బీజేడీ రాజ్యసభ ఎంపీ, ఒడియా సినీహీరో ముజిబుల్లా ఖాన్ (మున్నా ఖాన్) ఆరోపించారు. గురువారం రాత్రి పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. తన స్వస్థలం ఒడిశాలో నబరంగ్‌పూర్ జిల్లాలోని కుగ్రామం అన్నారు. తమ గ్రామంలో హిందువుల అమ్మవారి జాతరలు జరిగినప్పుడు తన కుటుంబ పెద్దలు ముందుంటారన్నారు. తమకు అక్కడ వేర్వేరు మతాలు అనే భావనలు ఉండవని పేర్కొన్నారు. ఒడిశాలోని ప్రతీ వ్యక్తి మతాలకు అతీతంగా జగన్నాథ స్వామివారిని నమ్మతామని పేర్కొన్నారు. ఖుర్దా జిల్లాలో పవిత్ర రథయాత్రలో భాగంగా చెరాపొరని ఒక ముస్లిం నిర్వహిస్తాడని వెల్లడించారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన విధానాలతో ఇరుమతాల ప్రజల్లో అనేక భయాలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డు మీద కేంద్ర ప్రభుత్వం పగ తీర్చుకుంటోందని విచారం వ్యక్తం చేశారు.