అచ్చంపేట: నాగార్జునసాగర్ కెనాల్స్ నుంచి సాగునీరు రాకపోవడంతో రైతులు రోడ్డుపై బైటాయించి ధర్నాకు దిగిన ఘటన మండలంలోని జరిగింది. వేల్పూరు వద్ద ఆర్ అండ్ బీ రోడ్డుపక్కనే ఉన్న నాగార్జునసాగర్ కాలువ వద్ద మంగళవారం ఈ ధర్నా చోటుచేసుకుంది. సాగర్ కెనాల్స్ కింద సుమారు 100 ఎకరాలకుపైగా సాగు భూమి ఉంది. ఈ ఆయకట్టులో మిర్చి, పొగాకు, మొక్కజొన్న తదితర పంటలు వేశారు. పంట మరో నెల రోజులలో చేతి అందే పరిస్థితులున్నాయి. ఈ సమయంలోనే పంటలకు నీటి తడులు ఎక్కువగా పెట్టుకోవాలి. ఇలాంటి తరుణంలో నాగార్జునసాగర్ కెనాల్స్ నుంచి నీటిని వదలకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైటాయించి తమ ఆవేదనను వెళ్లగక్కారు. వెంటనే సాగునీటిని వదలాలంటూ నినాదాలు చేశారు. గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ యేడాది పంటకాలం ప్రారంభంలో అధిక వర్షాల వల్ల పత్తి పంటను పూర్తిగా కోల్పోయామని, మిర్చికి తెగుళ్లు సోకడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయని చెప్పారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు రెండవ పంటగా వేసుకున్న పొగాకు, మొక్కజొన్నలలకు కూడా నాగార్జున సాగర్ కెనాల్స్ ద్వారా సాగునీరు వదలడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. పంటలకు ఈ సమయంలో సాగునీరు చాలా అవసరమని, లేకుంటే రూ.లక్షల పెట్టుబడులు పెట్టి వేసిన పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో తమకు దిక్కెవరంటూ మొర పెట్టుకున్నారు. సుమారు గంటపాటు సత్తెనపల్లి నుంచి అచ్చంపేట వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ఎక్కడిక్కడ నిలిపివేశారు. ఇంతలో స్థానిక ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మట్లాడారు. సాగునీటిని వదులుతామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment