మక్కువ/విజయనగరం ఫోర్ట్: విద్యుత్‌కనెక్షన్ మంజూరుకు మక్కువ మండలం ములక్కావలసకు చెందిన రైతు డి.ఈశ్వరరావు నుంచి ట్రాన్స్‌కో ఏఈ పోలాకి శాంతారావు రూ.60వేలు డిమాండ్ చేయడం... ఇప్పటికే రైతు రూ.20 వేలు చెల్లించగా.. మిగిలిన రూ.40వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈపై దాడిచేయడం.. ఆ సమయంలో అధికారులను గుర్తించి పొలాల్లోకి ఏఈ కారు వేగంగా నడపడం.. ఆయనను బైక్‌తో వెంబడించిన సీఐను కారుతో ఢీకొట్టి గాయాలు పాలుచేసిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులకు ఆదివారం రాత్రి చిక్కినట్టే చిక్కి పరారైన ట్రాన్స్ కో ఏఈ శాంతారావు ఆచూకీ 24 గంటలు గడచినా లభ్యం కాలేదు.
ఏఈ ఆచూకీకోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు ఫోన్‌లో సంప్రదించారు. సరెండర్ అయ్యేలా సహకరించాలని కోరారు. ఆయన ఆచూకీ ఆ శాఖ అధికారులకూ దొరకకపోవడం గమనార్హం. శాంతారావు ఫోన్ నంబర్‌ను ఏసీబీ అధికారులు లోకేషన్ ట్రాప్ చేస్తున్నా.. పాపయ్యవలస గ్రామ సమీపంలోని పంట పొలాల వద్దే సిగ్నల్స్ చూపిస్తోంది. ఏఈ తన ఫోన్‌ను పొలంలో విసిరేసినట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఏఈ కారును సీజ్ చేసిన అధికారులు
ఏఈ శాంతారావు కారును పాపయ్యవలస గ్రామ సమీపంలోని పంట పొలాల మధ్యలో వదిలేసి పరారవ్వడంతో కారును ఏసీబీ అధికారులు సోమవారం సీజ్ చేసి మక్కువ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతవరకు ఏఈ ఇంటికి గాని, స్నేహితుల ఇంటికి గాని ఆయన చేరలేదు. అధికారుల కళ్లుగప్పి పరారీలో ఉన్న ఏఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆది నుంచీ అంతే...
ఏఈ పొలాకి శాంతరావుపై ఆదినుంచి అవినీతిపరుడన్న ముద్ర ఉంది. విద్యుత్‌శాఖలో కాంట్రాక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆ శాఖలోని లొసుగులన్నీ తెలుసుకున్నాడు. అదే శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఎక్కడ ఏ పని చేస్తే డబ్బులు వస్తాయో తెలుసుకున్న శాంతారావు... ఆ మార్గానే ఎంచుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి. డెంకాడ, విజయనగరంలోని డీ–2 సెక్షన్, గంటస్తంభం ఏరియా, డి–3 విజయనగరం, వి.టి.ఆగ్రహారం ప్రాంతంలో పనిచేసి ఇటీవల మక్కువ మండలానికి బదిలీపై వెళ్లాడు.
విద్యుత్‌స్తంభాలు మార్పు చేసినా, లైన్‌ను మార్చినా, అపార్ట్ మెంట్లు, ఇళ్లకు కనెక్షన్లు మంజూరు చేయాలన్నా చేయితడపాల్సిందే. లేదంటే పని పూర్తికాదన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతుల నుంచి ఎక్కువగా డబ్బులు వసూలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అతనికి రాష్ట్ర స్థాయిలో విద్యుత్‌శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు ఒకరు బంధువు కావడంతో అవినీతికి పాల్పడినా తనను ఏమి చేయారనే ధీమాతో ఉండేవారు. విజయనగరం, డెంకాడ మండలాల్లో పనిచేసినప్పడు అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా, ఎవరూ ఫిర్యాదుచేయలేదు. ఎట్టకేలకు మక్కువకు చెందిన రైతు ఏఈ అవినీతి దాహానికి తట్టుకోలేక ధైర్యంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆయన ఏసీబీ అధికారుల కళ్లుగప్పి పరారుకావడం ఆ శాఖ అధికారులను విస్మయం కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment