ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Published Wed, Nov 1 2023 1:22 AM | Last Updated on Wed, Nov 1 2023 12:15 PM

- - Sakshi

● 8వ తరగతి విద్యార్థి మృతి ● బయటపడ్డ మరో విద్యార్థి ● విద్యార్థిని కాపాడిన స్వామి

శృంగవరపుకోట: సెలవు రోజు ఈత కోసమని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చాడు ఆ విద్యార్థి. విజయనగరం పైడితల్లమ్మ ఉత్సవం కావటంతో మంగళవారం పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో ధర్మవరం గ్రామానికి చెందిన నలుగురు స్కూలు విద్యార్థులు కలిసి వేములాపల్లి శివాలయం సమీపంలోని కోనేరుకు ఈతకు వెళ్లారు. ఇద్దరు ఒడ్డున కూర్చోగా చప్ప సాయి, ముని జయచరణ్‌తో కలిసి కోనేరులోకి ఈతకు దిగారు. ఈత కొడుతున్న సమయంలో మరికాస్త ముందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న మరో ఇద్దరు స్నేహితులు కేకలు వేయటంతో దగ్గరలో ఉన్న వేములాపల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారి లగుడు యశ్వంత్‌ కోనేరులో దూకి ఒకరిని ఒడ్డుకు చేర్చాడు. ఈ కేకలకు చుట్టు పక్కల పొలాల్లోని మహిళలు వచ్చి సపర్యలు చేస్తుండగా, మరో స్నేహితుడు లోపలే మునిగి పోయాడని చెప్పడంతో యశ్వంత్‌ మళ్లీ కోనేరులోకి దూకి రెండవ విద్యార్థిని ఒడ్డుకు చేర్చాడు. వీరిద్దరినీ ప్రైవేటు వాహనంలో ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించే క్రమంలో చప్ప సాయి (14) మృతి చెందాడు. జయచరణ్‌కు ప్రాథమిక చికిత్స చేసి, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. ఈ ఘటన గ్రామాన్ని విషాదంలోకి నెట్టింది. ఎస్‌.కోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే ఒక్కడు..

గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురం గ్రామానికి చెందిన రామారావుకు కొన్నేళ్ల క్రితం ధర్మవరం గ్రామానికి చెందిన కోటలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి చాలా సంవత్సరాలు సంతానం లేక తర్వాత సాయి పుట్టాడు. ఒక్కడే కావటంతో ముద్దుగా పెంచుకున్నారు. ఇటీవల వీరిద్దరికీ తిరుపతి సమీపంలో నాయుడుపేట వద్ద ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు రావటంతో కోటలక్ష్మి తన కుమారుడిని ఎస్‌.కోటలో ఓ ప్రైవేటు స్కూల్‌లో చేర్పించి, తన పుట్టింటి దగ్గర ఉంచింది. దీంతో మృతుడు సాయి ధర్మవరం కొత్తవీధిలో తన తాత పెంట సూర్యనారాయణ ఇంటి వద్ద ఉంటూ ఎస్‌.కోట పట్టణంలోని ప్రైవేటు స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. సాయి మరణంతో తాత, అవ్వలు గుండెలు బాదుకుంటూ ‘ఇప్పుడు మీ అమ్మానాన్నలకి మేము ఏం సమాధానం చెప్పాలి సాయి... మీ అమ్మా నాన్న కష్టం ఎవరి కోసం.. ఎందుకు వదిలి పోయావురా... ఈ వయసులో మాకీ కష్టం ఎందుకురా’ అంటూ రోదించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement