గంజాయి వ్యాపారంతో సంపాదించిన ఆస్తులు సీజ్
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు అయిన గంజాయి వ్యాపారి శెట్టి ఉమామహేశ్వరరావుకు చెందిన రూ.కోటి 97 లక్షల 62వేల 965 విలువైన స్ధిర, చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్, అలియాస్ పుతిన్ అనే వ్యక్తికి చెందిన కారులో 222 కిలోల గంజాయిని ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ నుంచి విశాఖకు తరలిస్తుండగా బొడ్డవర చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీ సమయంలో పట్టుబడిందన్నారు. విచారణలో ప్రధాన నిందితుడిగా ఉమామహేశ్వరరావును గుర్తించి పీటీ వారెంట్ తీసుకుని అరెస్టు చేశామన్నారు. ఇటీవల ప్రభుత్వం గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించి, ఉత్తర్వులు జారీచేయడంతో ,చర్యలకు ఉపక్రమించామని తెలిపారు. ఒక్కో కేసులో నిందితుల ఆస్తులపై పోలీసులు విచారణ చేపట్టారని చెప్పారు. నిందితుడు ఉమామహేశ్వరరావుపై ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖ సిటీ పరిధిలో ఏడు గంజాయి కేసులు నమోదైనట్లు, లాభసాటి వ్యాపారంగా భావించి గంజాయి అక్రమరవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. విచారణలో సంపాదించిన అక్రమ ఆస్తుల విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని వాటిని ఎవరికీ విక్రయించకుండా చట్ట పరిధిలో ప్రీజ్ చేసినట్లు నోటీసులు కూడా జారీచేశామన్నారు. ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పనిచేసిన విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి, ఇతర అధికారులను డీఐజీ అభినందించారు.
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
Comments
Please login to add a commentAdd a comment