జిల్లాలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో గోశాలల నిర్మాణానికి చర్యలు తీసుకోగా.. ఇందులో ఒక్క సాలూరు నియోజకవర్గానికే రూ.కోటి వరకు వెచ్చిస్తున్నారు. పల్లె పండగ కార్యక్రమం కింద జిల్లాలో రూ.211 కోట్ల వ్యయంతో 472 పనులు మంజూరు కాగా.. ఇందులో సాలూరు నియోజకవర్గంలోనే వంద వరకు సీసీ రహదారులు ఉన్నాయని కూటమి నాయకులు ప్రకటించారు. దీనికోసం రూ.5 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులతో మక్కువ మండలంలో 35, సాలూరు మండలంలో 22, పాచిపెంట 27, మెంటాడ మండలంలో 20 రోడ్లను పూర్తి చేసుకున్నట్లు చెబుతున్నారు. ఒక్క పాచిపెంట మండలానికే బీటీ రోడ్ల కోసం రూ.3 కోట్ల వరకు మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పనులన్నీ పంచాయతీ తీర్మానాలతో చేయాల్సి ఉన్నా.. వాటితో సంబంధం లేకుండా ఏకపక్షంగా ఆమోదించేసుకుంటున్నారు. దీనికి కారణం అధిక శాతం మంది వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌లు ఉండటమే. తమ హక్కులు కాలరాస్తున్నారని గ్రామ ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నా కూటమి నాయకుల తలకెక్కడం లేదు. కొన్నిచోట్ల సర్పంచ్‌లు పోరాడుతున్నా ఫలితం ఉండడం లేదు. వీటిలో అధిక శాతం గత ప్రభుత్వంలో మంజూరైన పనులు కూడా ఉండడం గమనార్హం. వార్డు మెంబరు కూడా కాని ‘తమ్ముళ్లు’ పంచాయతీల్లో పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ పనులన్నీ తమకే దక్కాలని పట్టుపడుతున్నారు. అవసరమైతే అభివృద్ధి కార్యక్రమాలనైనా నిలిపివేస్తున్నారు గానీ.. వెనక్కి తగ్గడం లేదు. సాలూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన గోకులాల పనుల్లో పురోగతి లేకపోవడం వెనుక ఇదీ ఒక కారణమే.
Comments
Please login to add a commentAdd a comment