నేడు మరియగిరి యాత్ర
● సహాయమాత ఉత్సవానికి
ఏర్పాట్లు పూర్తి
● 90 మంది పోలీస్ సిబ్బందితో
బందోబస్తు
● పాలకొండ, పార్వతీపురం,
శ్రీకాకుళం నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
● ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి 50 వేల
మంది భక్తులు వస్తారని అంచనా
వీరఘట్టం: వీరఘట్టానికి సమీపంలో యు.వెంకమ్మపేట వద్ద మరియగిరి కొండపై వెలసిన శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియమ్మ మహోత్సవానికి వేళయింది. ఏటా జనవరి 30న మరియగిరి యాత్రను నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా గురువారం నిర్వహించే మరియగిరి యాత్రకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కల, మతాలకు అతీతంగా యాత్రలో భక్తులు పాల్గొంటారు. టెంకాయలు కొట్టి, తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మరియమ్మను దర్శించుకొనేందుకు వీలుగా కొండపైన క్యూలు ఏర్పాటు చేశారు. కొండ దిగువన శ్రీకాకుళం మేత్రాసనం ఫీఠాపధిపతి రాయిరాల విజయకుమార్ ఆధ్వర్యంలో జరగనున్న దివ్యపూజకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ప్రార్థనా మందిరాన్ని సిద్ధంచేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చర్చి ఫాదర్లు, మఠకన్యలు హాజరై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. యాత్రా ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
90 మంది పోలీస్ సిబ్బంది
మరియగిరి యాత్రకు ఏడుగురు ఎస్ఐలు, ఒక సీఐతో పాటు 90 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నట్టు పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. పాలకొండ సీఐ చంద్రమౌళి, వీరఘట్టం ఎస్ఐ జి.కళాధర్‌తో కలిసి మరియగిరి ప్రాంగణాన్ని బుధవారం పరిశీలించారు. పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలను నిలుపుదల చేయాలని కోరారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మరియగిరి యాత్రకు వచ్చే ఉత్తరాంధ్ర జిల్లాల భక్తుల కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం ఆర్టీసీ డిపోల నుంచి ప్రతి 10 నిమిషాలకు మరియగిరి స్పెషల్ బస్సులు నడపనున్నట్టు ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. సుమారు 50 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనా మేరకు బస్సులు నడుపుతున్నామని పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment