నటుల మధ్య చిచ్చుపెట్టిన గ్రేటర్‌ పోరు | GHMC Elections 2020: Naga Babu Fires On Prakash Raj Over Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌ రాజ్‌, నాగబాబు మధ్య మాటల యుద్ధం

Published Sat, Nov 28 2020 8:28 AM | Last Updated on Sat, Nov 28 2020 3:45 PM

GHMC Elections 2020: Naga Babu Fires On Prakash Raj Over Pawan Kalyan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోరు రాజధానిలో రాజకీయ వేడిని మరింత పెంచింది. విమర్శకు ప్రతి విమర్శ చేస్తూ నేతలు రెచ్చిపోతుంటే.. ఎన్నడూ లేని విధంగా సినీ నటుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాజకీయ విమర్శల వేడి టాలీవుడ్‌ నటులకూ పాకింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతునిస్తూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ బహుబాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌ నాగబాబు ఘాటుగా స్పందించారు. పవన్‌ను ఊసరవెల్లితో పోల్చుతూ ప్రకాశ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అతని చరిత్ర ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్‌లోనే తెలిసిపోయిందని కొట్టిపారేశారు. (బీజేపీ ముందు పవన్‌ కీలక ప్రతిపాదన!)

ఈ మేరకు ప్రకాశ్‌ రాజ్‌కు కౌంటర్‌గా నాగబాబు ట్వీట్‌ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘రాజకీయల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్‌ టర్మ్‌లో ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. ప్రశాష్‌ రాజ్‌ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మస్వామి డిబేట్‌లోనే అర్థం అయ్యింది. నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ దృష్టిలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. 

మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరు. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడంలేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్‌ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. మరోసారి పవన్‌ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు’ అంటూ ఘాటు వ్యాఖ్యలతో నాగబాబు ట్వీట్‌ చేశారు. (హై పిచ్‌లో బ్యాలెట్‌ బీట్‌)

కాగా ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ప్రకాశ్‌ రాజ్‌ స్థానిక రాజకీయాలపై ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ‘ ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి మద్దతునిచ్చి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంద‌రినీ నిరాశ‌ప‌ర్చాడు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి వ‌చ్చిన ఓటింగ్ శాతం ఎంత వ‌చ్చిందో తెలియ‌దా..? మీరు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డానికి పవన్‌ ఎందుకు వెళ్తున్నారు. 2014లో ప‌వ‌న్ ఎన్డీఏ త‌రుపున ప్రచారం చేస్తూ..మోదీని గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. కానీ 2019లో ఆ మాట‌లు ప‌క్కన పెట్టి లెఫ్ట పార్టీల‌తో క‌లిసి వెళ్లి..మోదీ, టీడీపీని విమ‌ర్శించారు. ఇక 2020 లో మ‌ళ్లీ బీజేపీతో క‌లిసి ముందుకొస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ఊస‌ర‌వెళ్లి త‌ప్ప మ‌రొక‌టి కాదు’ అని ప‌్ర‌కాశ్ రాజ్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement