గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఓవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సీటు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు.. పార్టీ మారి, లేదా స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్రంలోని అధికార బీజేపీకి చెందిన పలువురు ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు లోక్ సభ అభ్యర్ధులు పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
వివరాలు.. గుజరాత్‌కు చెందిన బీజేపీకి చెందిన మహిళా ఎంపీ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు శనివారం వెల్లడించారు. బీజేపీకి చెందిన రంజన్‌బెన్ ధనంజయ్ భట్ వడోదర నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. దీంతో మూడోసారి కూడా వడోదర నుంచి ఆమెనే అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
చదవండి: కాంగ్రెస్‌కు షాక్!.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు
అయితే వడోదర లోక్‌సభ స్థానం నుంచి భట్‌ను తిరిగి నామినేట్ చేయడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ బ్యానర్లు వెలిశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రంజన్‌బెన్ భట్ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
రంజన్ భట్ తన అభ్యర్ధిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరో బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఎన్నికల రేసు నుంచి వైదొలిగారు. సబర్‌కాంత బీజేపీ అభ్యర్థి భిఖాజీ ఠాగూర్ కూడా వ్యక్తిగత కారణాలతో ఎంపీగా పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ప్రకటించారు. అయితే అతని ఇంటి పేరు, కులంపై వివాదం చెలరేగడంతో ఆయన ఈ నిర్ణంయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా సబర్‌కాంత నుంచి రెండుసార్లు గెలుపొందిన దిప్‌సిన్ రాథోడ్‌ను కాదని భిఖాజీకి ఈసారి బీజేపీ టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఎంపీ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment