
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పిలుపునిచ్చారు. చిన్న పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆదివారం చెప్పారు. యూపీలోని చిన్న పార్టీలన్నింటికీ ద్వారాలు తెరిచి ఉంచామని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎటువైపు ఉన్నాయో తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీఎస్పీలు ఎవరిపై పోరాడుతున్నాయి? బీజేపీపైనా లేక సమాజ్‌వాదీ పార్టీపైనా? అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీపై ఇటీవలి కాలంలో కాంగ్రెస్, బీఎస్పీలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే చాలా చిన్న పార్టీలు తమతో చేతులు కలిపాయని, త్వరలో మరిన్ని పార్టీలు సైతం ముందుకొస్తాయని అఖిలేశ్ వెల్లడించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 350 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఉద్ఘాటించారు. పెగసస్ స్పైవేర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన తప్పుపట్టారు. లోక్‌సభలో ఎన్డీయేకు 350కిపైగా స్థానాలున్నాయని, చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అలాంటప్పుడు స్పైవేర్‌తో ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ శక్తులకు కేంద్రం సహరిస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను సైతం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. న్యాయమూర్తులపైనా నిఘా పెట్టడం ఏమిటని ధ్వజమెత్తారు.
కుల సమ్మేళనాలు.. యాత్రలు
అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిణామంపై అఖిలేశ్ స్పందించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇతర పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని ‘భాగీదారి మోర్చా’తో తాము ఇప్పటిదాకా ఎలాంటి చర్చలు జరుపలేదని వివరించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కుల సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలను ప్రజలకు వివరించడానికి యాత్రలు చేపడతామని అన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డారు.