
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పోషించాల్సింది కోడలు పాత్ర కాదని, పెద్ద కొడుకు పాత్ర అని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడల కారణంగానే ఇన్ని సమస్యలు వస్తున్నాయని, అవసరమైతే పార్టీ కోసం ఆయన ఓ మెట్టు దిగిరావాలని అన్నారు. సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుంటే పార్టీలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు.
గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పదవుల్లో ఉన్న నాయకులు అందరినీ సమన్వయం చేసుకుంటే అపార్థాలుండవని, కానీ పార్టీ విభేదాలను కోడళ్ల పంచాయితీతో పోలిస్తే మాత్రం పార్టీ చిన్నాభిన్నం అవుతుందని పేర్కొన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు మాజీ కావాల్సిందేనని, పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు.
పార్టీ కోవర్టుల గురించి ప్రతిసారీ చర్చకు రావడం బాధాకరంగా ఉందని, ఈ విషయంలో సీనియర్ నేత దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. ప్రతి నాయకుడు కోరుకునేది ఆత్మగౌరవమేనని, ఆత్మాభిమానానికి మించింది ఏమీ ఉండదని చెప్పారు. రానున్నది ఎన్నికల సమయమని, ఈ సమయంలో చేయాల్సింది పార్టీ కమిటీల్లో బలప్రదర్శన కాదని, ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, ఎన్నికల్లో బలప్రదర్శన చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో తమ ఆవేదన చెప్పుకుంటామని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.