రాజస్తాన్‌లో స్వింగ్‌ ఎటు ?  | Analysis on Rajasthan Elections | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లో స్వింగ్‌ ఎటు ? 

Published Fri, Oct 13 2023 4:47 AM | Last Updated on Fri, Oct 13 2023 1:42 PM

Analysis on Rajasthan Elections - Sakshi

రాజస్తాన్‌లో ప్రజలు వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరాటంతో చెరో అయిదేళ్లు అధికారాన్ని పంచుకుంటున్నాయి. పార్టీ విజయాల్లో స్వింగ్‌ స్థానాలే కింగ్‌ మేకర్స్‌గా మారి అధికారంలోకి ఎవరు రావాలో నిర్ణయిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఈ స్వింగ్‌ స్థానాల్లో ఏ పార్టీకి ఎలా ఉంది ? ఈ సారి ఓటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారు ?  

రాజస్తాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 166 నియోజకవర్గాల్లో ఓటరు నాడి పట్టుకోవడం కష్టంగా మారింది. ప్రతీసారి ఆ నియోజకవర్గాల్లో ప్రజలు పార్టీని మార్చేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌పై బీజేపీ తన పట్టు ప్రదర్శిస్తోంది. ప్రజల రాజకీయ ప్రాధాన్యాలేంటో తలపండిన రాజకీయ నాయకులకి కూడా అంతుపట్టడం లేదు. 2008లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించినా  2018లో కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకున్నప్పటికీ స్వింగ్‌ స్థానాలు మాత్రం రాజస్తాన్‌ రాజకీయాల్లో వైల్డ్‌ కార్డులుగా మారాయి. 2018లో స్వింగ్‌ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలు కూడా తమ ఉనికిని చాటాయి. ఎవరి ఊహకు అందని విధంగా 12 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తే, బీఎస్పీ రెండు స్థానాలు, సీపీఎం ఒక్క స్థానాన్ని దక్కించుకున్నాయి.  

స్వింగ్‌ ఎందుకు కింగ్‌ ?  
స్వింగ్‌ స్థానాల్లో ఓటరు ఒక్కోసారి ఒక్కో రకంగా తీర్పు ఇస్తూ  ఉండడంతో ఆ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం రాజకీయపార్టీలకు అనివార్యంగా మారింది. ఎన్నికల వ్యూహాలన్నీ ఆ స్థానాల ప్రాధాన్యాలకనుగుణంగానే రచిస్తున్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు రచించడం అత్యంత కీలకంగా మారింది. ఈ స్థానాల్లో వచ్చే ఫలితాలే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుంటాయి.

2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే భారతీయ జనతా పార్టీ 28 నియోజకవర్గాల్లో వరుసగా నెగ్గుతూ వస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి అయిదు స్థానాల్లో వరుసగా విజయం సాధిస్తూ వచ్చింది. 2008లో స్వింగ్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా నిలిస్తే 2013 ఎన్నికల నాటికి బీజేపీ పూర్తిగా తన పట్టు బిగించింది. ఇంచుమించుగా క్లీన్‌ స్వీప్‌ చేసింది. గత ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకున్నప్పటికీ స్వతంత్ర 

అభ్యర్థులు అధికంగా విజయం సాధించడం చూస్తుంటే ఓటర్లు స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఈ సారి ఈ స్వింగ్‌ స్థానాల్లో పట్టు బిగించి కింగ్‌లా మారాలని తహతహలాడుతున్నాయి. 

ఎలక్షన్‌  బీట్‌...
అదొక ఫ్యామిలీ పోలింగ్‌ బూత్‌ 
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అతి చిన్న పోలింగ్‌ కేంద్రం అది. ఆ పోలింగ్‌ బూత్‌లో ఓటర్ల సంఖ్య కేవలం 44. వారంతా రక్తసంబం«దీకులు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఆ గ్రామాన్ని కాపాడుకోవడానికి  కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్‌ బూత్‌ని ఏర్పాటు చేసింది.మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బాలాఘట్‌ జిల్లాలోని సోనెవాని గ్రామానికి 55 కి.మీ. ట్రెక్కింగ్‌ చేసి వెళ్లాలి.

ఇప్పటివరకు ఎన్నికలు జరిగినప్పుడు సోనెవాని గ్రామంలో నివసిస్తున్న ఆ పెద్ద కుటుంబంలోని 44 మంది  కొండలు, గుట్టలు, నదులు దాటుకొని 20 కి.మీ. దూరంలో నవేగావ్‌ గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసేవారు. ఈ ఏడాది ఎన్నికల సంఘం ఆ గ్రామంలో ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్న ఒక పాఠశాలని పోలింగ్‌ కేంద్రంగా మార్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ స్థులు ఊపిరి పీల్చుకున్నారు.  ఓటు వేయడానికి ఇకపై ప్రయాస పడనక్కర్లేదని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు చెప్పారు.  

కౌంటింగ్‌ తేదీని మార్చాలి  
అయిజ్వాల్‌: మిజోరంలో ఓట్ల లెక్కింపుని డిసెంబర్‌ 3కి బదులుగా మరో రోజు నిర్వహించాలని క్రిస్టియన్లు అధికంగా ఉండే మిజోరం రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. డిసెంబర్‌ 3 ఆదివారం క్రిస్టియన్లకు పరమ పవిత్రమైన దినమని చర్చిలో ప్రార్థనలకు వెళ్లాలి కాబట్టి కౌంటింగ్‌ తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, అధికార ఎంఎన్‌ఎఫ్‌ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాయి.

రాష్ట్రంలో ప్రధాన చర్చిలు కూటమితో పాటు జోరమ్‌ పీపుల్‌ మూవ్‌మెంట్, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌లు కూడా తేదీని మార్చాలని డిమాండ్‌ చేశాయి. ఆ రోజంతా చర్చిలో సేవలు చేయడంలో ప్రజలందరూ నిమగ్నమై ఉంటారని కౌంటింగ్‌ తేదీని మార్చాలని కోరుతున్నాయి. మిజోరంలో 87% మంది క్రిస్టియన్లే ఉన్నారు. మిజోరంతో పాటు తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పుడు కౌంటింగ్‌ తేదీని డిసెంబర్‌3గా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.  

ఛత్తీస్‌గఢ్‌లోని రెండు గిరిజన గ్రామాలు ఎన్నికల బహిష్కరణ 
రాయపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లాలో రెండు గిరిజన గ్రామాలు ఈ సారి ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి. ఇప్పటికీ గ్రామాల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయని గ్రామస్థులు వాపోతున్నారు. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదని, విద్యుత్‌ సదుపాయం లేక అంధకారంలో మగ్గిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న సర్థియా, బగ్ధారిదంద్‌ గ్రామాల్లో ప్రజలు తమకు కనీస సదుపాయాలు కూడా కల్పించకపోతే ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్ని బహిష్కరించాలంటూ పాంప్లెంట్లు పంచుతూ, బ్యానర్లు కట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తుండగా రామ్‌పూర్‌లో తొలివిడత నవంబర్‌ 7న పోలింగ్‌ జరగనుంది.   

12వ తరగతి వరకు ఉచిత విద్య 
మధ్యప్రదేశ్‌ ఎన్నికల ర్యాలీలో ప్రియాంక హామీ  
మాండ్లా: మధ్యప్రదేశ్‌లో విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని, స్కూలు పిల్లలకు అలవెన్స్‌లు కూడా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్న మాండ్లా జిల్లాలో గురువారం ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే పఢో–పఢావో పథకం కింద 12వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకి నెలకి రూ.500, 9–10 తరగతి విద్యార్థులకి నెలకి వెయ్యి రూపాయలు, 11, 12 తరగతి విద్యార్థులకి నెలకి రూ.1500 ఇస్తామన్నారు.

రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రియాంక గాంధీ పునరుద్ఘాటించారు. ఆదివాసీలు, ఇతర వెనుక బడిన వర్గాల వారికి జనాభాలో తమ నిష్పత్తి ఆధారంగా ఉద్యోగాలు రావడం లేదన్నారు. అందుకే కులగణన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘‘బిహార్‌లో ఇటీవల రాష్ట్రంలో కులగణన నిర్వహిస్తే జనాభాలో 84% ఎస్‌సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఉన్నారని తేలింది. కానీ ఉద్యోగాలు చేస్తున్న వారి లో వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు’’ అని ప్రియాంక అన్నారు. 

బీజేపీలోకి మిజోరం స్పీకర్‌ ! 
అయిజ్వాల్‌: మిజోరం అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) కు షాక్‌ తగిలింది. పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర స్పీకర్‌ లాల్‌ ర్నిలియానా సైలో పార్టీకి గుడ్‌ బై కొట్టేశారు. పార్టీ ఆయనకు టిక్కెట్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో సైలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతుందని చెప్పారు.

మిజోరం అధికార పక్షమైన ఎంఎన్‌ఎఫ్‌కి ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు గుడ్‌ బై కొట్టేశారు. స్పీకర్‌ కూడా రాజీనామా చేయడంతో పార్టీని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి బీజేపీ పెద్దలతో కొన్ని డిమాండ్లు చేశానని, మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు వారు అంగీకరించారని సైలో వెల్లడించారు.  

ఎన్నికల్లో ఫేస్‌బుక్, గూగుల్‌ తటస్థంగా వ్యవహరించాలి 
న్యూఢిల్లీ: దేశంలో ప్రజల మధ్య మతపరమైన విద్వేషాలకు సోషల్‌ మీడియా వేదికలు కారణమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పేర్కొంది. రాబోయే ఎన్నికల్లో ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి సామాజిక మాధ్యమాలు తటస్థంగా వ్యవహరించాలని కోరింది. పక్షపాత ధోరణి సరైంది కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కి తాజాగా లేఖలు రాసింది.

ఇండియాలో ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్‌ వంటివి అధికార బీజేపీకి, ప్రధాని మోదీ అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, పక్షపాతం ప్రదర్శిస్తున్నాయని వాషింగ్టన్‌ పోస్టు పత్రికలో కథనం వెలువడింది. ఈ నేపథ్యంలోనే ‘ఇండియా’ కూటమి జుకర్‌బర్గ్, సుందర్‌ పిచాయ్‌కి లేఖలు రాసింది. ఈ లేఖలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement