ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ సమయంలో జనప్రభంజనం సునామీలా కనిపించింది. మెజార్టీ స్థానాల్లో ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది.
ప్రతి ఇంటికీ లబ్ది చేకూర్చడం అధికార పార్టీకి ఉమ్మడి జిల్లాలో కలిసొచ్చిన అంశం. కూటమి పొత్తులు, గుర్తుల గందరగోళాలు, చివరి నిమిషంలో వచ్చి చేరిన దిగుమతి నేతలు మోసుకొచ్చిన సమస్యలే కాకుండా... కేవలం దౌర్జన్యాలు, పోల్ మేనేజ్‌మెంట్‌ను నమ్ముకోవడంతో కూటమి పరిస్థితి అయోమయంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అమలయ్యాయి. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బాగా పడిందనే వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది.
ఇక టీడీపీ కంచుకోట అని చెప్పుకునే నియోజకవర్గాల్లో సైతం ఫ్యాన్ హవా బాగా కనిపిస్తోందని, సైలెంట్ ఓటుతో ఓటర్లు కూటమి పార్టీలకి షాక్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు తెగబడినా, కైకలూరులో కూటమి అభ్యర్థి పోలీసులపై బెదిరింపులకు దిగినా ఓటింగ్ శాతంపై ఎక్కడా ప్రభావం చూపలేదు. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో 83.65గా నమోదైంది. ఉంగుటూరులో అత్యధికంగా 87.75 శాతం నమోదుకాగా ఏలూరులో అత్యల్పంగా 71 శాతం నమోదైంది.
అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. సంక్రాంతి పండక్కి బారులు తీరినట్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారిలో 50 నుంచి 60 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పోలింగ్‌కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంతో పోలింగ్ శాతం గతం కంటే కూడా స్వల్పంగా పెరిగింది. అలాగే రెండు జిల్లాల్లో 18 ఏళ్ళు నిండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 80 వేలకు పైగానే ఉంది. దీంతో పోలింగ్ కేంద్రాల్లో యువత, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.
ఏలూరు జిల్లాలో ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటికీ పథకాలు అందాయి. ఊళ్లు రూపురేఖలు మారాయి. ప్రతి ఊరిలో నాడు-నేడు కార్యక్రమంతో బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌తో సహా కీలక అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. వంచనకు, విశ్వసనీయతకు మధ్య జరిగిన ఎన్నికల సంగ్రామంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్‌కే ప్రజలు మళ్లీ పట్టం కట్టారనీ తెలుస్తోంది.
ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో 548 సచివాలయాలు నిర్మించి, 600 రకాల సేవలను ప్రజలకు స్థానికంగా అందిస్తున్నారు. పెన్షన్ మొదలుకొని పౌర సేవలు, రేషన్ వంటివి ఇంటికే అందిస్తున్నారు. 271 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నిర్మించి పల్లెల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 2,83,239 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 350 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు.
నాడు-నేడుతో జిల్లాలో 2,032 పాఠశాలలను రూ.270.75 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర జగన్ సర్కారుది. రూ.713.17 కోట్లతో 98,874 ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించింది. జిల్లాలో 2.81 లక్షల మందికి ఐదేళ్లలో రూ.3,880 కోట్ల పెన్షన్, 35,745 ఆసరా గ్రూపుల్లోని రూ.3.55 లక్షల మంది మహిళలకు రూ.1305.05 కోట్ల రుణమాఫీ, 1.78 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద రూ.1,069.30 కోట్లు, 1.73 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఏటా రూ.130.15 కోట్ల చొప్పున విద్యా కానుక ఇలా పలు సంక్షేమ పథకాల వేల కోట్ల లబ్ధిని చేకూర్చారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన దిగుమతి నేతలతో స్థానిక నేతలకు సమస్యలు, కూటమి పేరుతో చివరి నిమిషంలో ఊడిపడ్డ జనసేన, బీజేపీ నేతలతో చికాకులు, నాయకులతో సమన్వయలేమి ఇలా గందరగోళాలతో సైకిల్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్నా జిల్లాను పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకోవడం, కొన్నిచోట్ల పెద్ద ఎత్తున విధ్వంసకాండ, కోట్ల దోపిడీ, అధికారులపై దాడులు వంటి ఘటనలను జిల్లా ప్రజలు మరిచిపోలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థి, దిగుమతి నేత పుట్టా మహేష్‌కు జిల్లా నేతల నుంచి సహకారం లేకపోవడం, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు ఇలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల వివాదాలను పరిష్కరించలేని పరిస్థితితో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం చేయలేక చేతులెత్తేశారు.
జిల్లాలో చంద్రబాబు ఏలూరు, నూజివీడు, దెందులూరులో సభలు నిర్వహించినా అట్టర్ ఫ్లాప్ కావడంతో పార్టీ కేడరే లైట్ తీసుకుంది. అలాగే కీలక నియోజకవర్గాల అభ్యర్థులు పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. ఐదేళ్ల జగన్ సంక్షేమ పాలనలో నవరత్నాల ద్వారా జిల్లాలో రూ.8,500 కోట్ల మేర నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఏలూరు వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడం, కొల్లేరు మిగులు భూముల పంపిణీకి వీలుగా సర్వే ప్రక్రియ తుది దశకు చేరడం, టీడీపీ విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రధాన పనులు పూర్తిచేయడంతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీలో సమగ్ర అభివృద్ధి పనులు జరిగాయి.
ఏలూరులో 50 ఏళ్ల నుంచి ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌ను రూ.80 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు. అలాగే బుట్టాయగూడెం, చింతలపూడి, నూజివీడుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ క్వీన్‌స్వీప్ దిశగా దూసుకువెళ్తోంది. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండుసార్లు గడపగడపకూ వెళ్లడం, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారడం పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. పార్టీ అధినేత, సీఎం జగన్ దెందులూరులో లక్షలాది మందితో సిద్ధం బహిరంగ సభ నిర్వహించడం, ఏలూరు, కైకలూరులో ఎన్నికల ప్రచార సభలు, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో రోడ్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచారం చేశారు. అటు పార్టీ అధినేత వైఎస్ జగన్, ఇటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజలతో మమేకం కావడం, పాజిటివ్ ఓటు మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తేలిపోయింది.
నర్సాపురం పార్లమెంట్ పరిధిలోనూ వైఎస్సార్‌సీపీదే హవా!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో వైఎస్‌ఆర్సీపీకి ఎదురుండదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంపీ సీటుతో సహా, ఏడు అసెంబ్లీ స్థానాలపై పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ధీమాగా కనిపిస్తున్నారు. జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. వారి ధీమాకు కారణం ఏంటో చూద్దాం.
నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగనుంది. నర్సాపురం ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు.
మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్య క్రమాలు, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు, మరోపక్క కూటమిలోని వర్గ విభేదాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు స్పందన లేకపోవడం, కూటమి మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదనే వాదన ప్రజల్లో స్పష్టంగా కనబడుతోంది. సీఎం జగన్ పాలనలో జిల్లాలో ప్రగతి పరవళ్లు తొక్కింది. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల ద్వారా 11,364.57 57 కోట్లు లబ్దిదారులకు అందించారు. జిల్లాలో 6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.
నరసాపురంలో ఆక్వావర్సిటీ, ఫిషింగ్ హార్బర్, పాలకొల్లులో వైద్య కళాశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తలమానికమయ్యాయి. నాడు-నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను ప్రజల చెంతకు చేర్చారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలోని 6,05,780 మంది లబ్దిదారులకు ఉచితంగా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో 447 వైద్యశిబిరాలు ద్వారా ప్రజల చెంతకే వెళ్లి 4.10 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. నవరత్న పథకాల్లో భాగంగా 77 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశారు.
పొత్తులు కుదుర్చుకుని కూటమిలోని మూడు పార్టీలు సీట్లు ప్రకటించిన తర్వాత జనసేన శ్రేణుల్లో నిస్సత్తువ అలముకుంది. పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ ఆచంటలో ఆ పార్టీ ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడే రెండోసారి భీమవరం నుంచి పోటీకి వెనుకడుగు వేయడం, భీమవరంలో సొంత నేతలకు సత్తాలేదని టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను దిగుమతి చేసుకుని సీటు ఇవ్వడం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. టీడీపీ పోటీ ఉన్నచోట తమకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదని జనసేన నేతలు మదనపడుతున్నారు. భీమవరం, తణుకు, నరసాపురం తదితర నియోజకవర్గాల్లో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.
కూటమితో పోలిస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా దూసుకుపోయారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతిఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడం, జగనన్న సురక్ష, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలతో ఐదేళ్లుగా జనం మధ్యనే ఉండటం ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలకు మరింత చేరువచేసింది. ఆయా గ్రామాలు, వార్డులకు వెళ్లినప్పుడు స్థానికులను పేర్లు పెట్టి పిలుస్తూ, మీ సమస్యలు పరిష్కరించామని చెబుతూ, ఐదేళ్ల ప్రగతిని వివరిస్తూ, చేపట్టబోయే పనులను తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభించింది.
వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉంటే టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదిగా ఉందని ప్రజలు పెదవి విరిచారు. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు హామీలను వారు విశ్వసించలేదు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన రోజుల్లో జగన్ సర్కారు,
వైఎస్సార్సీపీ అభ్యర్థులు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు, మూడు పార్టీల అధినేతలు అప్పుడేమయ్యారని ప్రజలు ప్రశ్నించారు. టీడీపీ, జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ తుస్సుమంది. సభా ప్రాంగణంలో సగానికి పైగా ఖాళీగానే కనిపించింది. ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు. తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రచార సభలకు జనం రాక వెలవెలబోయాయి. వారు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది.
జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం ప్రభంజనంలా తరలిరావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సుయాత్రకు దారిపొడవునా బారులు తీరి జననేతకు బ్రహ్మరథం పట్టారు. భీమవరం, నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలకు మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు ఏడింటిలో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ తాజా పరిస్థితుల నేపధ్యంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
70 ఏళ్ల నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో తొలి బీసీ మహిళా నేత వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీటు ఇవ్వడాన్ని జిల్లాకు చెందిన కూటమి అసెంబ్లీ అభ్యర్థులు వ్యతిరేకించారు. బీసీ మహిళకు సీటు ఇవ్వడం వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిన అంశమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఉమాబాల విజయానికి బాటలు వేస్తుందని అంటున్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment