అసాధారణ పోలింగ్‌ శాతం.. ఈసీ క్లారిటీ ఇవ్వాల్సిందే: అంబటి | YSRCP Leaders Met AP CEO Vivek Yadav Over Form 20 Details, More Details Inside | Sakshi
Sakshi News home page

అసాధారణ పోలింగ్‌ శాతం.. అనుమానాల్ని ఈసీ నివృత్తి చేయాల్సిందే: అంబటి

Published Tue, Aug 27 2024 12:20 PM | Last Updated on Tue, Aug 27 2024 1:47 PM

YSRCP Leaders Met AP CEO Vivek Yadav Over Form 20 Details

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని, వాటిని నివృత్తి చేయాలని అవసరం ఎన్నికల సంఘానికి ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఉదయం పలువురు వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధులు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ను కలిశారు. అనంతరం సచివాలయం వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు. 

ఏపీలో పోలింగ్‌ శాతం వివరాలపై మాకు అనుమానం ఉంది. పోలింగ్‌ శాతాన్ని ఈసీ మూడుసార్లు వేర్వేరుగా వెల్లడించారు. ఏయే అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది?. ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించడం లేదు. ఫారం-20 సమాచారాన్ని వెంటనే అప్‌లోడ్‌ చేయాలని అని అంబటి, ఈసీని డిమాండ్‌ చేశారు. 

ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేస్తారని మొదట చంద్రబాబే అన్నారు. గతంలో ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయో వీవీప్యాట్‌లో కూడా అన్నే చూపించాలి. కానీ, ఏపీలో అలాంటి పరిస్థితి లేదు అని ఆరోపించారాయన. మా అనుమానాల్ని ఈసీ నివృత్తి చేయాల్సిందే. త్వరలో ఈసీ స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారాయన. ఏపీ సీఈవోను కలిసిన వాళ్లలో అంబటితో పాటు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు.సీఈఓ ని మా పార్టీ ప్రతినిధులం కలిశాము

‘‘ఎన్నికల ఫలితాలపై ఓట్ ఫర్ డెమోక్రసీ అనుమానాలు వ్యక్తం చేసింది. మాకు ఉన్న అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరింది. ఈ అనుమానాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సి ఉంది. ఆరు గంటల తర్వాత కేవలం క్యూ లో ఉన్నవారికి మాత్రమే ఓటింగ్ కి అవకాశం ఇస్తారు. ఆ టైంలో ఎన్నికల కమిషన్ 68.12 శాతం ఓటింగ్ జరిగిందని ప్రకటించింది. 

అసాధారణ పోలింగ్ శాతం.. ఈసీ క్లారిటీ ఇవ్వాల్సిందే

.. రాత్రి 11.45 గంటలకి 76.5 శాతం ఓటింగ్ పెరిగింది అని ప్రకటించింది. ఫైనల్ గా 80.66 శాతం ఓటింగ్ జరిగిందని ప్రకటించారు. చాలా తేడా ఉంది. జూన్ 4 న లెక్కింపు నాడు 82 శాతం చూపించారు. ఇదంతా అనుమానాస్పదంగా ఉంది. ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఈసీ చెప్పాలి. 

.. 12 శాతానికి పైగా వ్యత్యాసం ఉండటం అసాధారణంగా ఉంది. దీనిని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయకపోవడం అనుమానాస్పదంగా ఉంది. అలాగే ఫారం 20 లో పార్టీల వారిగా ఓట్లను ప్రకటించాలి. కానీ ఈసీ ఈరోజు వరకు కూడా పార్టీల వారిగా ఓట్లను ప్రకటించలేదు. ఇది చాలా విచిత్రం, అసాధారణ చర్య. గతంలో ఎప్పుడు ఎన్నికల్లో ఇంత ఆలస్యం జరగలేదు. ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ అధికారుల నుండి రాలేదు అంటున్నారు. దీంతో రోజు రోజు కీ అనుమానాలు బలపడుతున్నాయి.. 

..విజయనగరం, గజపతినగరం లలో మా అభ్యర్థులు ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఉంది. అది ఎలా సాధ్యం అని తనిఖీ కోసం ఫిర్యాదు చేశారు. ఈవీఎంలను భద్రపరిచాక బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరుగుతుంది?. దానికి మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటి?. వీవీప్యాట్‌లను తనిఖీ చేయమంటే ఒంగోలులో మాక్ పోలింగ్ అంటున్నారు. ఈ అనుమానాలు అన్నింటికీ ఈసీ సమాధానం చెప్పాలి

.. ఈవీఎంల తనిఖీ కి వెళితే తాళాలు లేవు అన్నారు. అధికారులు దగ్గర తాళాలు లేకపోవడం ఏంటి..?. ఈరోజుకి పోలింగ్‌పై ఫైనల్ ఫిగర్ చెప్పక పోవడం ఏంటి?. అందుకే సీఈవోను కలిసి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement