
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లా తెలుగుదేశంలో జనసేనతో పొత్తు తీవ్ర కలవరం రేపుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మైలవరం, పెడన, అవనిగడ్డ.. ఈ ఐదు నియోజకవర్గాల్లో తమకు నాలుగు నియోజకవర్గాలు కేటాయించాలని జనసేన నాయకులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎటువంటి పరిస్థితుల్లో మూడు సీట్లకు తగ్గేది లేదని భీష్మించుకు కూర్చున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఆ మూడు సీట్లతో పాటు, ఎంపీ సీటుపైన టీడీపీ పూర్తి ఆశలు వదులుకుకోవాల్సిందేననే భావనలో టీడీపీ ఉంది.
టికెట్ ఇచ్చినా ఓడిస్తాం..
మరోవైపు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీటు కూడా ఇవ్వడానికి వీలులేదని, టీడీపీ అధినేతపై ఒత్తిడి తేవాలని తెలుగు తమ్ముళ్లు చూస్తున్నారు. విజయవాడలో జనసేనాని సామాజిక వర్గానికి రాజకీయంగా పట్టు ఏర్పడితే, తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలకు విఘాతం అని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. అనివార్యం అయితే ఒకటి, రెండు సీట్లు జనసేనకు ఇచ్చినా, ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని టీడీపీ ధ్యేయంగా పెట్టుకొంది. జనసేనకు గాని, ఆ పారీ్టకి దన్నుగా ఉన్న సామాజిక వర్గానికి ఎనీ్టఆర్ జిల్లాలో స్థానం లేకుండా చేయాలన్నదే టీడీపీ ఎత్తుగడ. ఈ విషయం బయటికి పొక్కడంతో జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీట్ల వ్యవహారంపై తాడో పేడో తేల్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెబుతున్నారు.
టీడీపీ సైలెంట్..
జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో కాడి పడేయటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య టికెట్‌పై గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, ఎంకే బేగ్‌లు తమకే టికెట్ వస్తుందని బహిరంగ ప్రకటనలు గుప్పిస్తున్నారు. జనసేన సైతం పొత్తులో భాగంగా ఈ సీటు తమకే కేటాయిస్తారని ఆ పార్టీ నేత పోతిన మహేష్ హడావుడి చేస్తున్నారు. ఇక్కడ టికెట్‌పై స్పష్టత లేకపోవడంతో.. అక్కడ అసలే అంతమాత్రంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఇక్కడ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆసిఫ్ ప్రచారం ముమ్మరం చేశారు.
మండలికి మళ్లీ సారీ!
ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీలో సైతం అవనిగడ్డ టికెట్ జనసేనకు ఇవ్వాలని కోరారు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్‌కు ఈసారీ టికెట్ దక్కే అవకాశం లేదనే భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. బుద్ధ ప్రసాద్ కూడా సైలెంట్‌గా ఉన్నారు. ఇక్కడ జనసేనకు టికెట్ ఇస్తే, ఓటమి తప్పదని, టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. పెడన నియోజకవర్గం టికెట్ జనసేనకు కేటాయిస్తారనే గట్టి నమ్మకంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. టీడీపీ నేతలు కాగిత కృష్ణప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్ వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. టికెట్‌పై ఎటూ తేలకపోవడంతో, టీడీపీ నేతలు అంటీ ముట్టనట్లు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పొత్తు ఖరారు కాకముందే కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించటాన్ని అక్కడ జనసేన పార్టీ శ్రేణులు జీరి్ణంచుకొలేకపోతున్నారు.
గద్దె సీటుకు ఎసరు!
తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటించడం లేదు. టికెట్ వస్తుందో రాదో అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. జనసేన నాయకులు సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని రెండు, మూడు సార్లు చుట్టేశారు. తాజాగా కుటుంబ సభ్యులందరితో కలిసి, తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ, తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని వైఎస్సార్ సీపీ తరఫున పార్లమెంట్ ఇన్‌చార్జిగా ప్రకటించడం పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు కలిసొస్తోంది. తాజాగా మైలవరం జనసేనకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. అక్కడ దేవినేని ఉమాకు టికెట్ లేదని టీడీపీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేయడంతోపాటు, అక్కడ అభ్యర్థి ఎవరో తేలక పోవడంతో దేశం శ్రేణుల్లో స్తబ్దత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment