ఢిల్లీ: ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీసేలా!.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ సమావేశం నిర్వహించారు. 2025లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ నెలఖరున ముంబయిలో ఇండియా కూటమి నిర్వహించనున్న కీలక సమావేశానికి ముందు ఆప్ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
బిహార్‌లో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని సందీప్ పాఠక్ నాయకులకు సూచించారు. నీచరాజకీయాల కారణంగానే బిహార్ ముందుకు పోవడం లేదని ఆరోపించారు. ఆప్ తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అంతకుముందే పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులను కోరారు. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ బిహార్ ఇంఛార్జీ అజేష్ యాదవ్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.
గుజరాత్‌లో మాదిరిగానే బిహార్‌లోనూ పూర్తి స్థాయిలో పోటీ చేస్తామని పాఠక్ అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయగానే తదుపరి ప్రణాళికలను వెల్లడిస్తామని చెప్పారు. బిహార్‌లో పంచాయతీ ఎన్నికల్లో మొదట పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేశం కఠిన సమయంలో ఉందని పాఠక్ అన్నారు. ప్రధాని మోదీ ఈ తొమ్మిదేళ్లలో ప్రసంగాలు ఇవ్వడం తప్పా.. ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ఇండియా కూటమి పరిస్థితిపై ప్రశ్నించినప్పుడు.. 'పార్టీల అభిప్రాయాలు వేరు.. దేశమే ప్రధానం.. కూటమిలు తర్వాత' అని పాఠక్ చెప్పారు. ఆప్ జాతీయ పార్టీ.. ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు.
జేడీయూ, ఆర్జేడీ రియాక్షన్..
ఆప్ నిర్ణయంపై ఆర్జేడీ నాయకుడు, ఎంపీ మనోజ్ స్పందించారు. 'ఇండియా కూటమిని నిర్మించేప్పుడే కొన్ని కట్టుబాట్లను పెట్టుకున్నాం. ఈ విధివిధానాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆప్ కూటమి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి'అని ఆయన సూచించారు.
పార్టీని విస్తరించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ అన్నారు. తాము కూడా ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తామని చెప్పారు. కూటమి పార్టీలన్నీ ఏకంగా పోటీచేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా ఇతర నాయకులు చెప్పారు. అంతర్గత అభిప్రాయ భేదాలు క్రమంగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ నోట బ్రియాన్ డి ఖర్ప్రాన్ పేరు.. ఎవరీయన?
Comments
Please login to add a commentAdd a comment