ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణల కేసు విచారణ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
'బీజేపీ ఎలాంటి కుట్ర పనైనా చేయగలదు. నేను కూడా గట్టిగానే ఉన్నా. ఎప్పటికీ లొంగిపోను. నన్ను బీజేపీలో చేరమని అడుగుతున్నారు. నన్ను ఒంటరిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో ఎప్పటికీ చేరబోనని చెప్పాను. అది ఎప్పటికీ జరగదు.' అని ఢిల్లీలోని రోహిణిలో పాఠశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆప్ అధినేత మాట్లాడారు.
ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన బడ్జెట్‌లో 40 శాతాన్ని పాఠశాలలు, ఆసుపత్రుల కోసం ఖర్చు చేయగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం జాతీయ బడ్జెట్‌లో 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. జైలులో ఉన్న ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ గురించి కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు.
"ఈరోజు అన్ని కేంద్ర ఏజెన్సీలు మన వెంటే పడుతున్నాయి. మంచి పాఠశాలలను నిర్మించడమే మనీష్ సిసోడియా చేసిన తప్పు. మంచి ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు నిర్మించడమే సత్యేంద్ర జైన్ చేసిన తప్పు. పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయకపోతే మనీష్ సిసోడియా జైలుకు వెళ్లేవారు కాదు. బీజేపీ అన్ని రకాల కుట్రలు చేస్తోంది. కానీ మమ్మల్ని అడ్డుకోలేకపోయారు" అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల కేసులో మంత్రి అతిశీకి నోటీసులు అందించేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేడు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె లేకపోయేసరికి చాలా సేపు అక్కడే వేచి ఉన్నారు. కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించాలని అతిశీ కోరినప్పటికీ వారు నిరాకరించారు. ఇదే కేసులో సీఎం కేజ్రీవాల్‌కు శనివారం నోటీసులు అందించారు.
ఇదీ చదవండి: కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment