టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్ | Bandi Sanjay And Kishan Reddy Comments On TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్

Published Sat, Dec 5 2020 5:50 AM | Last Updated on Sat, Dec 5 2020 9:03 AM

Bandi Sanjay And Kishan Reddy Comments On TRS - Sakshi

గడీల పాలనను బద్ధలు కొట్టే దమ్మున్న పార్టీ బీజేపీనేనని, గడీల నుంచి సీఎం కేసీఆర్‌ను బయటకు తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. కారుకు సన్‌ స్ట్రోక్‌ తగిలిందని, కమలానికి సన్‌రైజ్‌ కలిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు. ఎంఐఎంకు, టీఆర్‌ఎస్‌కు సీట్లు తగ్గాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. తాము అహంకారాన్ని నెత్తికి ఎక్కించుకోబోమని, హైదరాబాద్‌ ప్రజల సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు.      
–సాక్షి, హైదరాబాద్‌

సారు, కారు.. ఇక రారు.. 
హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామని సంజయ్‌ చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో బీజేపీకి సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా భారీగా పెరిగింది. కార్యకర్తల కంటే ఎక్కువగా ఎన్నికల కమిషనర్, డీజీపీ టీఆర్‌ఎస్‌ కోసం కష్టపడ్డారు. బీజేపీ విజయాన్ని ఎన్నికల కమిషనర్, డీజీపీకి అంకితం ఇస్తున్నాం. సారు, కారు.. ఇక రారు. 2023లో కారు షెడ్డుకు పోవడం ఖా యం. అర్ధరాత్రి ఎన్నికల కమిషనర్‌ తప్పుడు సర్క్యులర్‌ను విడుదల చేయటం దారుణం’ అని అన్నారు.

కుటుంబ పాలనకు వ్యతిరేకిస్తూ తీర్పు.. 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు తీర్పు ఇచ్చారని సంజయ్‌ పేర్కొన్నారు. ‘ఇదీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. భాగ్యనగర్‌ ప్రజలు సర్జికల్‌ స్ట్రైక్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే టీఆర్‌ఎస్‌పై సాఫ్రాన్‌ స్ట్రైక్‌ చేశాం.  ప్రచారంలో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఎన్నికల ఇన్‌చార్జి భూపేంద్రయాదవ్‌లకు ధన్యవాదాలు’అని చెప్పారు. 

కేటీఆర్‌కు ప్రజలే జవాబిచ్చారు: కిషన్‌రెడ్డి 
‘కేటీఆర్‌ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన సవాల్‌ను స్వీకరించాలి. టీఆర్‌ఎస్‌ వేగంగా ప్రజల ఆదరణను కోల్పోతోంది. 2023లో బీజేపీఅధికారంలోకి రావడానికి ఈ గ్రేటర్‌ ఎన్నికలే ప్లాట్‌ఫాం. అక్రమ కేసులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు వెనుకడుగు వేయలేదు. కూలిపోతున్న టీఆర్‌ఎస్‌లోకి తమ కార్పొరేటర్లు వెళ్లబోరు’అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.  

సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలి: లక్ష్మణ్‌ 
ఈ ఫలితాలు టీఆర్‌ఎస్‌ పతనానికి నాంది అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ‘టీఆర్‌ఎస్‌ మతోన్మాద మజ్లిస్‌ మైత్రిని ప్రజలు గుర్తించారు. అందుకే టీఆర్‌ఎస్‌ను ఓడించారు. నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలి’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూ ర్తిని కొనసాగిస్తామని జాతీయ ఉపాధ్యక్షురా లు డీకే అరుణ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. 

ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టిన కోర్టు : సంజయ్‌
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఏ గుర్తు వేసినా ఓటు చెల్లుతుందని ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన సర్క్యులర్‌ను సస్పెండ్‌ చేసి, ఓటర్ల విశ్వాసాన్ని కోర్టు నిలబెట్టిందని బండి సంజయ్‌ చెప్పారు. ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ‘ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకొని న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని పెంచింది. ఇది జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం. ఎలక్షన్‌ కమిషనర్‌ వెంటనే రాజీనామా చేయాలి. ప్రజాతీర్పును గౌరవించలేని వ్యక్తికి సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పోలింగ్‌ 12% నుంచి 18% శాతానికి ఎలా పెరిగింది. కొన్ని పోలింగ్‌ స్టేషన్లలో ఉన్నట్టుండి 90 శాతానికి పోలింగ్‌ పెరిగింది. ఇందులో ఏదో గ్యాంబ్లింగ్‌ జరిగిందనే అనుమానం ఉంది. దీనిపై కూడా విచారణ జరపాలి’అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement