మొయినాబాద్ (చేవెళ్ల): ‘‘తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో 1,400 మంది అమరులైతే.. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం గుర్తించింది 600 మందినే. అమరవీరుల ఆత్మబలిదానాలతో ఏర్పాటైన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అధికారం అనుభవిస్తూ జల్సాలు చేస్తోంది. ఆ అమరవీరుల సాక్షిగానే కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం మొయినాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితున్ని సీఎం చేస్తానని, వారికి 3 ఎకరాల భూమి ఇస్తానని దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్, ఇప్పుడు కొత్తగా దళిత జపం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లకోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు నిధులిస్తే, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడం లేదని ఆరోపించారు.
111 జీవోను సమర్థిస్తారా.. వ్యతిరేకిస్తారా?
ఎన్నో సంవత్సరాలుగా చేవెళ్ల ప్రాంతంలో 111 జీవో సమస్యగా మారిందని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం 111 జీవోను సమర్ధిస్తుందో వ్యతిరేకిస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. సీఎం కేసీఆర్‌కు, ఆయన కూతురు, కొడుకు, అల్లుడికి ఈ ప్రాంతంలో ఫాంహౌస్‌లు ఉన్నాయని.. వాటిని కాపాడుకోవడం కోసం జీవోను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు.
రోడ్లు, బియ్యం, డబుల్ బెడ్రూం ఇళ్లు, హరితహారం అన్నింటికీ కేంద్రం నిధులిస్తుందని.. కానీ రాష్ట్రమే ఇస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో, ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సందీప్ పాత్ర, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ పాలన అంతమొందించాలి: బండి
Published Wed, Sep 1 2021 5:04 AM | Last Updated on Wed, Sep 1 2021 5:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment