సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 73వ రోజున నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌లో మాట్లాడారు. వట్టెం రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
వట్టెం రిజర్వాయర్‌లో అన్‌కాన్‌పల్లితండా, కారుకొండతండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా, అన్‌కాన్‌పల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఇక్కడి నిర్వాసితులంతా నూరు శాతం దళిత, గిరిజనులేనని పేర్కొన్నారు. వీరిపట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, ఉద్యోగం కల్పించా ల్సి ఉండగా బాధ్యతను మర్చిపోయిందని విమర్శించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ భూ నిర్వాసితులకు ఉద్యోగం ఇస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు.
ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం హామీతోనే నిర్వాసితులంతా సంతకాలు చేశారని, ఇప్పుడు వారిని ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. దీంతో నిర్వాసితులు ఉన్న ఊరు, భూమి, ఇల్లు, ఉపాధి కోల్పోయి దిక్కులేనివారయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు భూమి, ఉద్యోగం, పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందిచకపోతే పోరాడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment