లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హథ్రాస్ ఘటనను అడ్డం పెట్టుకుని డబ్బు వసూలు చేస్తున్నారనే సీఎం ఆరోపణలపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. సీఎం యోగి భీమ్ ఆర్మీపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని చంద్రశేఖర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. గౌరవప్రదమైన జీవితానికి కట్టుబడి ఉంటానని అన్నారు. చివరి శ్వాస వరకు తన జాతి బాగుకోసం పనిచేస్తానని, ఖర్చుల భారం కూడా తన జాతి బిడ్డలే భరిస్తారని అన్నారు. అంతేగానీ ఇతరుల వద్ద చేయి చాచమని, బెదిరింపులతో సొమ్ము రాబట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
(చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్)
100 కోట్లు కాదు కదా.. లక్ష రూపాయలు వసూలు చేసినట్టు తేలినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటానని అన్నారు. భీమ్ ఆర్మీపై చేసిన ఆరోపణలు తప్పని రుజువైతే యోగి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని చంద్రశేఖర్ సవాల్ విసిరారు. హథ్రాస్ ఘటనపై అంతర్జాతీయ సమాజం స్పందించి.. న్యాయం జరగాలి అని కోరితే అనవసర ఆరోపణలు చేస్తున్నారని యోగీపై మండిపడ్డారు. కాగా, అంతర్జాతీయ నిధుల ద్వారా కుల, మత అల్లర్లకు పునాది వేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని సీఎం యోగి భీమ్ ఆర్మీపై పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. భీమ్ ఆర్మీ విదేశాల నుంచి డబ్బు వసూలు చేసిందనేందుకు ఎలాంటి ఆధారలు లేవని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చింది.
(చదవండి: దళిత యువతి మృత్యు ఘోషకు భయపడే..)
Comments
Please login to add a commentAdd a comment