సాక్షి, హైదరాబాద్: మునుగోడు ప్రజలు కోరితే రాజీనామానే కాదు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. చారిత్రక అవసరమైతే తప్పకుండా రాజీనామా చేస్తానన్నారు. నాలుగు రోజుల నుంచి తనపై వస్తున్న వార్తలు, రాజీనామా వ్యవహారంపై ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన మాట వాస్తవమేనని, అయితే రాజకీయాల గురించి గానీ, రాజీనామా గురించి గానీ చర్చించలేదని, సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా అప్పుల పాలుచేసి అవినీతికి పాల్పడుతున్నారనే అంశాలపై మాత్రమే చర్చించినట్టు స్పష్టంచేశారు. దేశంలో సాదు జంతువులాంటి కాంగ్రెస్ పార్టీని చంపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, పరోక్షంగా పులిలాంటి బీజేపీని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే పులి రేపో మాపో కేసీఆర్‌ను, అయన పార్టీని చంపుతుందన్నారు. సమయం వచ్చినప్పుడు పార్టీ మారాల్సి వస్తే విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా తప్పుకుంటానని స్పష్టంచేశారు.
కేసీఆర్ ట్రాప్‌లో పడను
తాను అమిత్‌షాను కలవగానే కేసీఆర్ భయంతో వణికిపోతున్నారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అందుకే, రాజీనామా.. ఉప ఎన్నికలంటూ తన పత్రికలు, టీవీల్లో వార్తలు రాయించుకొని అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తలను, అభిమానులను గందరగోళంలో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ట్రాప్‌లో తాను పడనని, మునుగోడు అభివృద్ధి కోసం హుజురాబాద్ ఉప ఎన్నికలప్పుడే రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి గుర్తుచేశారు.
తన రాజీనామా వార్తల నేపథ్యంలోనే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారని, ఇలా అయినా నియోజకవర్గ ప్రజల కోరిక నెరవేర్చినందుకు కేసీఆర్‌కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలాగా నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉప ఎన్నికలు రావాలా అని ప్రశ్నించారు. పూర్తి మెజారిటీ ఉన్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రంగులు మార్చుకోవాల్సిన ఖర్మ తనకు లేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే ఆయన్ను ఎదిరించి ఎమ్మెల్సీగా గెలిచానని, 2018లో మహామహులు ఓడినా తాను గెలిచి వచ్చానంటే తానేంటో నల్లగొండ, భువనగిరి, మునుగోడు ప్రజలకు తెలుసునన్నారు.
అవమానాలు ఎదురైనా భరించి ఉంటున్నా...
కాంగ్రెస్‌లో అనేక అవమానాలు ఎదురైనా భరించి ఉంటున్నానని, పార్టీ అంటే అమితమైన అభిమానమని, సోనియాగాంధీపై గౌరవం ఉందని రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు. కానీ, అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుందని, తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్లని, జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లని తెచ్చి పదవులు ఇచ్చిందని పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆవేదనతో గతంలో కొన్నిసార్లు మాట్లాడానని, తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ బలహీనపడుతోందని అభిప్రాయపడ్డారు.
గతంలో కూడా కేసీఆర్‌ను కొట్టాలంటే అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమని చెప్పినట్టు గుర్తుచేశారు. జైలుకు పోయి వచ్చిన వాళ్లతో తాను నీతులు చెప్పించుకోవాల్సిన అవసరంలేదని, తాను యుద్ధం మొదలుపెడితే విజయమో, వీర మరణమో తప్ప వెనక్కి వచ్చేది లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు మారుతూ ఉంటారని, పార్లమెంట్‌లో ఏ పార్టీ నేతలనైనా ఇతర పార్టీల వాళ్లు కలవచ్చని, అదేమీ తప్పుకాదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment