ఇల్లందకుంట(హుజూరాబాద్): తెలంగాణలో బాంచన్ బానిసత్వ బతుకులకు స్వస్తి పలకాలని..మేకల్లాగా కాకుండా పులి బిడ్డలా బతకాలని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో గురువారం బీజేపీ దళిత మోర్చా, మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. చిన్నతనం లోనే దళిత హక్కులు, ఆత్మగౌరవం కోసం కొట్లాడితే తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్‌ది నియంత ధోరణి అని ఆరోపించారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బులిచ్చి ప్రయత్నం చేశారని..తాను జీతగాణ్ణి కాదని, తాను కూడా గులాబీ జెండాకు ఓనర్‌నేనని ఆనాడే ప్రకటించానని పేర్కొన్నారు. పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తి హరీశ్‌రావు అని..తాను గొంతెత్తిన తర్వాతే హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు.
దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర సీఎస్‌గా పదవీ విరమణ చేస్తే అక్కడికి వెళ్లకుండా అవమానించారని, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మానసిక ఒత్తిళ్లకు గురిచేసి వారి ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చేలా చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. పార్టీలు జెండాలు, సిద్ధాంతాల కంటే మానవ సంబంధాలు గొప్పవని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కర్ణాటక ఎంపీ మునుస్వామి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీమంత్రులు చంద్రశేఖర్, బాబు మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment