జార్ఖండ్‌లో రాజకీయలు ఒక్కసారిగా వేడేక్కాయి. రాష్ట్ర సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్..ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్‌చేసే అవకాశం ఉన్న క్రమంలో జార్ఖండ్‌లో సీఎం మార్పు జరగనున్నట్లు తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో జేఎమ్‌ఎమ్‌తోపాటు ఇతర మిత్రపక్ష ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవాలని సీఎం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై మంగళవారం మధ్యాహ్నం సీఎం నివాసంలో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం?
జార్ఖండ్ రాజకీయ పరిణామలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమంత్ సోరెన్ జేఎమ్‌ఎమ్, కాంగ్రెస్, ఇతర మిత్రపక్ష ఎమ్మెల్యేలను రాంచీకి పిలిచారని తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. హేమంత్ తన సతీమణి కల్పనా సోరెన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈడీ విచారణతో సీఎం భయపడుతున్నారని, తాను రోడ్డు మార్గంలో దిల్లీ నుంచి రాంచీకి వస్తానని తన పార్టీ నేతలకు సోరెన్ చెప్పినట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు దూబే ఎక్స్‌లో (ట్విటర్) పోస్ట్ చేశారు.
భూ కుంభకోణానికి సంబంధించిన నీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్‌ను విచారించేందుకు సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఢిల్లీలోని సీఎం ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన అందుబాటులో లేరు. దీంతో 13 గంటలపాటు ఆయన నివాసంలోనే ఉండి ఈడీ అధికారులు సోదాలు జరిపారు. సీఎంకు చెందిన రెండు బీఎండబ్ల్యూ కార్లు, 32 లక్షల నగదుతోపాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే సోరెన్ జనవరి 27 రాత్రి తన వ్యక్తిగత పనుల నిమిత్తం రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరారని, త్వరలోనే తిరిగి వస్తారని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు. మనీలాండరింగ్ కేసులో జనవరి 29 లేదా జనవరి 31వ తేదీలలో విచారణకు హాజరవ్వాలని ఈడీ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. మరోవైపు జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని జార్ఖండ్ సీఎం ఇప్పటికే ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయనను విచారించే అవకాశాలున్నాయి. ఇక తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్‌లో సోరెన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment