బెంగళూరు: లోకసభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ-జేడీఎస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. సీట్ల పంపకం కూడా అయిపోయంది. అయితే తాజాగా ఇరు పార్టీల నేతల మధ్య అసమ్మతి బయటపడింది. ఇరుపార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రచార సమావేశంలో జేడీఎస్-బీజేపీ నేతల ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప బీజేపీ నేత కొండజ్జి విశ్వనాథ్‌పై విమర్శలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమికి కారణం కొండజ్జి విశ్వనాథ్ అని సమావేశంలో విమర్శలు చేయటంతో ఒక్కసారిగా కార్యకర్తల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
గతంలో జేడీఎస్‌లో ఉన్న విశ్వనాథ్ అనంతరం బీజేపీలో చేరారు. అయితే ఈ సమావేశంలో విశ్వనాథ్ మాట్లాడటానికి ప్రయత్నించగా బీజేపీ సీనియర్ నేత సోమన్న అడ్డుకున్నారు. ఇక.. జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభించింది. కొంత సమయం తర్వాత ఇరు పార్టీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ సద్దుమణిగింది.
బీజేపీతో పొత్తులో భాగంగా జేడీఎస్.. హసన్, మాండ్య, కోలార్ లోక్‌సభ స్థానాలను బీజేపీ ఇచ్చింది. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు డా. మంజూనాథ్ బీజేపీ టికెట్ మీద బెంగళూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కుమార్‌ను పోటీలోకి దింపింది. పాత మైసూరు ప్రాంతంలో.. జేడీఎస్ పొత్తుతో బీజేపీ ఒక్కలిగ ఓటర్ల మద్దుతు పొందాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment