మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నారాయణపేట: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, అందుకు కుటుంబ రాజకీయాలే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నారాయణపేటలో విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కుమ్మక్కై బీజేపీపై దుష్ప్రచారం చేశాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సోషల్ మీడియాలో అదే ప్రచారం సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరగటంతో పాటు 8 స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు.
ఈ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం లేకపోతే.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తప్పుచేశారంటూ కేసీఆర్ కుటుంబం ఇంకా అహంకారపు మాటలు మాట్లాడుతోందని విమర్శించారు. మజ్లిస్ సహకారంతో హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారని కిషన్‌రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్య రామమందిర నిర్మాణం చేపడితే, మజ్లిస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. రామమందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పంపించినా రాలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
మరోసారి మోదీనే ప్రధాని..
ఒక్క రూపాయి అవినీతి లేకుండా ధర్మబద్ధంగా పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైందన్నారు. ఆరు గ్యారంటీలు ఆరు గారెలుగా మారిపోయాయన్నారు. కాగా, బీఆర్‌ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ రకమైన ఎజెండా లేదని.. ఆ పార్టీ ఒక్క సీటు గెలిచినా ప్రజలకు మేలు జరగదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment