కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా | BJP National President JP Nadda Criticized TRS Government | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా

Published Mon, Aug 10 2020 2:41 PM | Last Updated on Mon, Aug 10 2020 4:52 PM

BJP National President JP Nadda Criticized TRS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు సోమవారం భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. వర్చువల్‌ వేదికగా ఢిల్లీ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 45వేల కోట్ల రూపాయలకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారని నిలదీశారు. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదని జేపీ నడ్డా దుయ్యబట్టారు. (తెలంగాణ ద్రోహిగా మిగలనున్న కేసీఆర్‌)

‘కరోనాను కట్టడి చేయకుండా సీఎం‌ కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదు. కరోనా టెస్టులు చేయటంలో తెలంగాణ వెనుకబడిపోయింది. లోక్ సభ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98 లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారు.  కోవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్రానికి దేశ ప్రజలు సహకరించాలి. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని కేంద్రం పనిచేస్తోంది. కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన. ప్రధాని మోదీ ఆలోచన మేరకు పార్టీ కార్యాలయాల నిర్మాణం. కోవిడ్ ను ఎదుర్కోవటంలో ప్రధాని మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.’ అని జేపీ నడ్డా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement