కుటుంబ పాలన అంతమే!  | BJP National President JP Nadda in Narayanapet and Chevella Sabhas | Sakshi
Sakshi News home page

కుటుంబ పాలన అంతమే! 

Published Mon, Nov 20 2023 5:20 AM | Last Updated on Mon, Nov 20 2023 5:20 AM

BJP National President JP Nadda in Narayanapet and Chevella Sabhas - Sakshi

అవినీతిపై విచారణ జరుపుతాం 
కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ పేరుతో నిరుపేదల భూములు లాక్కున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి అవినీతికి పాల్పడ్డారు. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీ కుంగడంతో భారీగా ప్రజాధనం వృథా అయింది. మియాపూర్‌ భూముల విషయంలో రూ.4వేల కోట్ల అవినీతి జరిగింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు విషయంలోనూ అవినీతి చోటుచేసుకుంది. మా ప్రభుత్వం వస్తే ఈ అవినీతిపై విచారణ చేసి దోషులను జైలుకు పంపుతాం. దళితబంధులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 30శాతం కమీషన్లు తీసుకున్నారు. స్వయంగా కేసీఆరే ఈ విషయం చెప్పారు. ఈ కమీషన్ల ప్రభుత్వాన్ని ఈనెల 30న సాగనంపుదాం. 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ చేవెళ్ల/గౌతంనగర్‌ (హైదరాబాద్‌):  ఎందరో అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబ పాలనలో చిక్కుకుందని.. ఈ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు అయ్యారని, వేల మంది ప్రాణత్యాగం చేశారని.. కానీ సీఎం కుర్చిలో కూర్చున్న కేసీఆర్‌ తెలంగాణ ప్రగతిని పక్కనపెట్టి కుటుంబ సంపదను పెంచుకున్నారని ఆరోపించారు. కుటుంబ పాలన చేసే రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ యుద్ధం చేస్తోందని, తెలంగాణలోనూ కుటుంబ పాలనను అంతం చేస్తామని చెప్పారు. ఆదివారం నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో, మల్కాజిగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో జేపీ నడ్డా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు పంపిస్తే.. కేసీఆర్‌ కుటుంబం ఆ నిధులను అభివృద్ధికి ఖర్చు చేయకుండా దుర్వినియోగం చేసింది. ఓట్లకోసం ఒక వర్గాన్ని సంతోషపర్చడానికి రిజర్వేçషన్లను పెంచుతామని చెప్పడం, రాష్ట్రంలో హిందూ ఆలయాల భూములను ఇతర పనులకు వాడుకోవడం ఆయనకే చెల్లింది. బీఆర్‌ఎస్‌ అవినీతి పార్టీ. రాక్షసుల్లా తెలంగాణను దోపిడీ చేస్తున్నారు. రైతులకు ప్రయోజనకరమైన ఫసల్‌ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదు.

పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన నిధులను దారిమళ్లించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్‌ను తగ్గించి పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గేలా చూస్తే.. తెలంగాణలో కేసీఆర్‌ తగ్గించకుండా ప్రజల సంక్షేమాన్ని విస్మరించారు. దేశంలోనే అధికంగా తెలంగాణలో 8.5 శాతం ద్రవ్యోల్బణం ఉంది. దేశంలో ఎక్కువగా డీజిల్, పెట్రోల్‌ ధరలు ఉన్న రాష్ట్రం తెలంగాణే. దళితబంధులో కూడా బీఆర్‌ఎస్‌ నేతలు కమీషన్లు తీసుకున్నారు. ఎక్కడా ఇంత దౌర్భాగ్యం లేదు. 

మోసం చేయడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ దిట్ట 
మోదీ సర్కారు దేశంలో మౌలిక సదుపాయాల కోసం ఏడాదికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయిస్తే.. ఒక్క తెలంగాణలో 5.21 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.లక్ష కోట్లతో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించాం. రూ.6,038 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. మోదీ ప్రభుత్వం చెప్పింది కచ్చితంగా చేసి చూపిస్తుంది. కాంగ్రెస్‌ చెప్పింది చేయదు. ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీ తీరు. కర్నాటకలో 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా అందజేస్తామన్నారు. ఏమైంది? నాలుగు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే. అవినీతి, ప్రజలను మోసం చేయడంలో దిట్టలు. 

బీజేపీ గెలిస్తే బీసీ సీఎం 
తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తాం. ఏడాదికి నాలుగు సిలిండర్లను ఉచితంగా అందజేస్తాం. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఎరువులపై రూ.18వేల సబ్సిడీ అందజేస్తాం. చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.2,500 ఇన్సెంటివ్‌ ఇస్తాం. పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గిస్తాం. విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు అందజేస్తాం. ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. వృద్ధులకు ఉచితంగా తీర్థయాత్రలు, నిరుపేదలకు రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తాం. సెపె్టంబర్‌ 17న అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ గ్యారంటీలకు వారంటీలు లేవు. అదే బీజేపీ ప్రభుత్వమిచ్చే గ్యారంటీలతో వికాసం ఉంటుంది. 

ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతాం 
బీజేపీ ప్రభుత్వం ఎక్కడున్నా మహిళలకు రక్షణ ఉంటుంది. అవినీతి నిర్మూలన, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటుంది. మోదీ హయాంలో ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా భారత్‌ ఎదిగింది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీని గెలిపిస్తే 2028 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుంది..’’అని నడ్డా పేర్కొన్నారు. ఈ సభల్లో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ  ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ అభ్యర్థులు, ఇతర నేతలు పాల్గొన్నారు. 

‘5జీ’ కేసీఆర్‌ను ఇంటికి పంపాలి 
బీఆర్‌ఎస్‌ అంటే భ్రష్టాచార్‌ రాష్ట్ర సర్కార్‌. ఇది తెలంగాణ ప్రజలను లూటీ చేస్తుంది. ఫోన్లలో 5జీ నెట్‌వర్క్‌ లాంటివారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే కేసీఆర్‌ 5జీ ఏంటంటే.. పేదరికం (గరీబీ), కుంభకోణం (గొటాలా), అహంకారం (గుస్సోడి), మోసకారి (గఫ్లేబాజ్‌), గూండాయిజం (గూండారాజ్‌). ఇలాంటి కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఇంటికి పంపాలి. ఆ సమయం వచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement