
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ స్పష్టం చేశారు. నాయకులందరూ ఒకే తాటిపై ఉన్నారనీ తామంతా కలిసికట్టుగానే ఉన్నామని తెలిపారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించామని, ఇక అధ్యక్షుడి మార్పు ఎక్కడిదని ఎదురు ప్రశ్నించారు.
తుపాను ప్రభావం అనేక రాష్ట్రాలపై పడే అవకాశాలుండడంతో గురువారం కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడిందని చెప్పారు. ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభను కూడా వాయిదా వేశామన్నారు. మళ్లీ అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు చేసి, ఖమ్మం సభకు సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని తరుణ్‌చుగ్ తెలిపారు.
త్వరలో ఖమ్మంలోనే అమిత్ షా సభ: బండి సంజయ్
త్వరలోనే ఖమ్మంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ నిర్వహించడం ఖాయమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బుధవారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల ఈ సభ రద్దుతో కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దని చెప్పారు. గుజరాత్, మహారాష్ట్రలలో తుపాను పరిస్థితుల కారణంగా అమిత్ షా 24 గంటలూ పర్యవేక్షించాల్సి ఉన్నందున ఈ సభకు రాలేకపోయారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment