
మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ
తిరుపతి గాంధీరోడ్డు: ప్రత్యేక హోదా అనేదే లేదని.. ఏపీకి అది ఇవ్వడం కుదరదని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చి.. ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ తరఫున పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ తన జన్మభూమి అని.. కర్ణాటక తన కర్మభూమి అని తెలిపారు. తనకు అవకాశమిస్తే రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతానని చెప్పారు.
జనసేనకు, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. డబ్బులకు అమ్ముడుపోకుండా ఓటు వేయాలని తిరుపతి ప్రజల్ని కోరారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు, అభివృద్ధికి దగ్గర కావడమే అజెండాగా పనిచేస్తానని చెప్పారు. తిరుపతిలో ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తారని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.