సాక్షి, అమరావతి: రాజధాని భూముల వ్యవహారాల్లో దమ్ముంటే విచారణ చేసుకోవాలని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి ‘స్టే’ ఎందుకు తెచ్చుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సవాల్ చేసి పారిపోవడంపై చంద్రబాబు, టీడీపీ నేతలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి బొత్స బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని మేం నిస్వార్థపరులం, రుషి పుంగవులం అంటే ఎలా? అని వ్యాఖ్యానించారు.
► అమరావతి భూముల వ్యవహారాల్లో పలు అక్రమాలు, దోపిడీ జరిగిందని మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాం. చంద్రబాబు, లోకేష్, వాళ్ల తాబేదారులు ఆ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు అక్రమంగా కొనుగోలు చేశారు. దీనిపై దమ్ముంటే విచారణ జరిపించాలని టీడీపీ నేతలు సవాళ్లు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదైంది, ఏం తేల్చారంటూ వ్యాఖ్యలు చేశారు.
► అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీనిపై సిట్ దర్యాపునకు ఆదేశిస్తే కోర్టుకు వెళ్లారు. ఏసీబీ కేసు పెడితే దానిపైనా కోర్టుకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? మీడియా ఈ విషయాన్ని చర్చకు పెట్టాలి. చర్చకు మేం సిద్ధం.
► ఈ వ్యవహారాల్లో కొందరు వ్యక్తుల పాత్రకు సంబంధించి ఆధారాలున్నట్లు ప్రాథమికంగా నిర్థారణ కావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగానే ఏసీబీ కేసులు నమోదు చేసింది.
► రాజధాని భూముల వ్యవహారాల్లో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. సామాన్యులకు అన్యాయం చేశారు. అందుకు సాక్ష్యాలు చూపించాం. చట్టం తన పని తాను చేస్తుంది. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసులు పెడుతున్నారన్న టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదు. పక్కదారి పట్టించేందుకు ఏ సమస్య ఉందో చెప్పాలి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వమేప్రశంసించింది. ఈ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో చంద్రబాబు చివరకు దేవాలయాల పేరుతో విమర్శలు చేస్తున్నారు. విజయవాడ దుర్గగుడిలో రథాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వినియోగించలేదు.
ప్రగల్భాలు పలికి ‘స్టే’ తెచ్చుకుంటారా?
Published Thu, Sep 17 2020 4:08 AM | Last Updated on Thu, Sep 17 2020 7:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment