సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్
సిట్టింగ్ ఎంపీలు నామా, మాలోత్ కవితకు మళ్లీ చాన్స్
కరీంనగర్‌లో వినోద్,పెద్దపల్లి నుంచి కొప్పుల
పాలమూరు ‘స్థానిక’ అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఖరారు చేశారు. నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్‌రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు.
ఆదివారం ఉమ్మడి కరీంనగర్, సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఆయా సమావేశాల్లో పార్టీ నేతలు చర్చించి అభ్యర్థుల పేర్లకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు కేసీఆర్ ప్రకటించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంయుక్త ఎన్నికల ఇన్‌చార్జిలుగా ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను కేసీఆర్ నియమించారు.
నేడు ఉమ్మడి పాలమూరు నేతలతో భేటీ
లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో భాగంగా కేసీఆర్ మంగళవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. నాగర్‌కర్నూలు సిట్టింగ్ ఎంపీ పి.రాములు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు పి.భరత్‌ను బీజేపీ నాగర్‌కర్నూలు అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. అయితే మంగళవారం నాటి భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
ఆల ఖరారు..నేడు ప్రకటన
ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. దీంతో అభ్యర్థి ఎంపికపై బీఆర్‌ఎస్ కసరత్తు పూర్తి చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్‌రాంరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చర్చల అనంతరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. మంగళవారం జరిగే భేటీ అనంతరం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.
రాహుల్‌గాందీతో పోటీకైనా రెడీ: నామా
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పోటీ చేసినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ప్రకటించారు. తనను మరోమారు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నామా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు ఎంపీగా గెలిచా. అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్‌ఎస్ వైపే ఉంటారు’అని నామా ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలు తప్పు చేశామనుకుంటున్నారు: మాలోత్ కవిత
మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ఎంపీ మాలోత్ కవిత ధన్యవాదాలు తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంటు వేదికగా తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి ఓట్లు వేసి తప్పు చేశామనే చర్చ ప్రజల్లో జరుగుతోందని పేర్కొన్నారు. మహబూబాబాద్‌లో మళ్లీ బీఆర్‌ఎస్‌దే విజయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment