ధాన్యం కొనేవారు లేక అన్నదాత అవస్థలు
పట్టించుకోని మంత్రులు, జిల్లాల కలెక్టర్లు
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
నంగునూరు (సిద్దిపేట): అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, జిల్లాల కలెక్టర్లు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నాడు రైతుల శ్రేయస్సు కోసం మాజీ సీఎం కేసీఆర్ కృషి చేస్తే.. నేడు రేవంత్‌రెడ్డి వారి ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు ఆదివారం సందర్శించారు. రైతులు తమ సమస్యలను ఆయనకు వివరించారు.
అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేవని, పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. చేసేదిలేక రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్నారని అన్నారు. రైతుల గోస ఎవరికీ పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనేవారు లేరని తెలిపారు.
బీఆర్‌ఎస్ పాలనలో 11 సీజన్లలో రూ.72,815 కోట్లు రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో వేస్తే.. నేడు కనీసం గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పత్తికి మద్దతు ధర లేదని, మక్కలు కూడా ఎవరూ కొనడంలేదని తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకుల విద్యార్థులకు శాపం
సాక్షి, హైదరాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురు కులానికి చెందిన 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని, సోకాల్డ్ ప్రజాపాలనలో అభంశుభం తెలియని పిల్లల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment