బీఆర్‌ఎస్‌కు మంచి భవిష్యత్తు: మాజీ మంత్రి కేటీఆర్
సీక్వెల్ మోసంతో రేవంత్‌రెడ్డి రెడీగా ఉన్నారు
కాంగ్రెస్ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు
బీజేపీ వాళ్లు ఏమీ చేయలేక జైశ్రీరాం అంటున్నారు..
అలంపూర్ సభలో ప్రసంగం
అలంపూర్: కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని సంకల్పిస్తే, దురదృష్టవశాత్తు 39 సీట్లలోనే గెలిచామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 14 సీట్లలో వెయ్యి, రెండు, నాలుగు వేల తేడాతో ఓడిపోయామని, ఆ 14 సీట్లు గెలిచి ఉంటే మన దే ప్రభుత్వం ఉండేదని చెప్పారు. లేదా వాటిలో ఆరు సీట్లు గెలిచినా ప్రధాన పాత్ర పోషించేవారమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో, అలంపూర్ చౌరస్తాలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
‘సీక్వెల్ సినిమాల తరహాలో పార్లమెంట్ ఎన్నికల కోసం సీఎం రేవంత్‌రెడ్డి సీక్వెల్ మోసంతో రెడీగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి మోసం పార్టు–1లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మీలో ఎవరైనా రుణాలు తీసుకోని వారు ఉంటే పరుగు పరుగునపోయి లోన్లు తీసుకోండి.. అని చెప్పిన ఆయన మే 9 వస్తున్నా రుణమాఫీ చేయలేదు. మోసం పార్ట్–2లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు’ అని కేటీఆర్ అన్నారు. అంతకుముందు కేటీఆర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్నారు.
అవన్నీ ఇచ్చి మాట్లాడు..
‘మొగోడివైతే ఒక్క సీటు గెలవమని మన పార్టీ గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి భాషలోనే అడుగుతున్నా... నీవు మొగోనివైతే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు. మొగోడివైతే కోటీ 67 లక్షల ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వు. కేసీఆర్ ఒకరికే ఇస్తున్నాడు నేను ముసలవ్వకి ముసలాయనికి ఇద్దరికీ రూ.4వేలు ఇస్తానని చెప్పావు కదా.. మొగోడివైతే 46 లక్షల మందికి ఆసరా పింఛన్ ఇచ్చి మాట్లాడు’ అని కేటీఆర్ అన్నారు.
మొన్న మహబూబ్‌నగర్‌కు వచ్చి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని ఒక సీఎం మాట్లాడని మాటలు రేవంత్ మాట్లాడారని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘సూర్యాపేటలో రష్ ఉన్న బస్సులో ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా.. ప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు జేబులు వెతికితే కత్తెర దొరికిందని అడిగితే.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయను పట్టుకోండి సార్ అని చెప్పారు’ అని చమత్కరించారు.
బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికేమీ లేదు..
బీజేపీ వాళ్లు అక్కడక్కడ ఎగురుతున్నారని, పదేళ్లలో రాష్ట్రానికి మోదీ చేసిందేమి లేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ వాళ్లు చెప్పుకోవడానికి ఏవీలేదని, అందుకే జైశ్రీరాం అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. శ్రీరాముడు బీజేపీకి ఒక్కడే దేవుడు కాదని.. ఆయన అందరి వాడన్నారు. దేవుళ్ల పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మి మోసపోవద్దు: కేటీఆర్
రాజేంద్రనగర్ (హైదరాబాద్): బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజేంద్రనగర్‌లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని ముందుకొస్తోందని... కాంగ్రెస్ దొంగ హమీలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి వచ్చిందన్నారు.
రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అందుకే చేవెళ్ల పార్లమెంటులో మొదటిసారిగా బడుగు, బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాందీ, మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు.
రేవంత్ నిజం చెప్పారు
సాక్షి, వరంగల్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కిండు రేవంత్... అయితే తప్పు రేవంత్‌రెడ్డిది కాదు... ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా, నిజాయితీగా చెప్పిండు ఎన్నికలకు ముందు టీవీ చర్చా వేదికల్లో. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారు... ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు... అందుకే మేం మోసం చేస్తాం అని చెప్పారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్, హనుమకొండలో మంగళవారం జరిగిన వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. తప్పు ఎవరిదన్నా ఉందంటే మనదే తప్ప ఇంకెవరిదీ కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment