పట్టభద్రుల కోటా టికెట్ కోసం ఇప్పటి నుంచే ఆశావహుల ప్రయత్నాలు
అధినేత కేసీఆర్ దృష్టిలో పడేలా సభ్యత్వ నమోదు పేరిట హడావుడి
ముందస్తుగా ప్రచారం పేరిట ఫ్లెక్సీల ఏర్పాటు
ఉపాధ్యాయ కోటా స్థానాల ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్?
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఉపాధ్యాయ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు, పట్టభద్రుల కోటాలో ఒక ఎమ్మెల్సీ ఆరేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఖాళీ అయ్యే స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బరిలో నిలించేందుకు బీఆర్‌ఎస్ నుంచి ఔత్సాహికులు ఇప్పటి నుంచే సందడి చేస్తున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో.. ఆశావహులు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల పేరిట జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు పేరిట ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా తాము పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్టు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సంకేతాలు పంపుతున్నారు.
ఉపాధ్యాయ కోటాపై అనాసక్తి
వచ్చే ఏడాది మార్చిలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి(పీఆర్‌టీయూ)తోపాటు ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి(యూటీఎఫ్) పదవీకాలం ముగుస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అధికారికంగా అభ్యర్థులను బరిలోకి దించలేదు. పీఆర్‌టీయూకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌తో పీఆర్‌టీయూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
అందరి దృష్టి పట్టభద్రుల స్థానంపైనే
‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. 13 జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉంది. ఓటర్లను చేరుకునేందుకు ఇప్పటి నుంచే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి రాజారాంయాదవ్ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ మద్దతుదారులను రంగంలోకి దించి ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ గతంలోనే తనకు హామీ ఇచి్చనట్టు రవీందర్ సింగ్ చెబుతున్నారు.
గతంలో.. బలమున్నా బరికి దూరం
మండలి పట్టభద్రుల కోటా 2019 ఎన్నికల సందర్భంలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్– నిజామాబాద్’నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి) మాత్రమే ఉన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను కలుపుకొని 40 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉంది. స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసిన చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.జీవన్‌రెడ్డి పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఇప్పుడు.. కీలక నేతలందరూ ఇక్కడే
ప్రస్తుతం ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 42 మంది ఎమ్మెల్యేలకుగాను కాంగ్రెస్‌కు 19, బీఆర్‌ఎస్‌కు 16, బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జి.మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), సంజయ్ (జగిత్యాల), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ) కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌కు క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం ఉందని, పార్టీ అవకాశమిస్తే గెలుపు సాధిస్తామనే ధీమా ఆశావహుల్లో కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment