సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్‌రావుపై మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు చేసిన తీవ్ర వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఆయనను మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, పార్టీ గీత దాటారనే కారణంతో వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. తన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో మంత్రి హరీశ్‌పై హన్మంతరావు తిరుమలలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘మెదక్‌లో ఆయన పెత్తనం ఏమిటి..ఆయనకు బుద్ధి చెప్తా. సిద్దిపేటలో ఆయనకు అడ్రస్ లేకుండా చేస్తా. ఆయన దుకాణం బంద్ చేసేవరకు నిద్రపోను..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిపై స్పందించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
టికెట్ దక్కని నేతలకు ఇతర పదవులు
‘తన కుటుంబసభ్యుడికి టికెట్ నిరాకరించడంతో మా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సహనం కోల్పోయి మంత్రి హరీశ్‌రావుపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము హరీశ్‌రావుకు సంఘీభావంగా ఉంటామని తెలియజేస్తున్నా. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అంతర్భాగంగా ఉంటున్న హరీశ్.. పార్టీకి ముఖ్య స్తంభంగా ఇకముందు కూడా కొనసాగుతారు..’అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపికైన బీఆర్‌ఎస్ అభ్యర్థులకు అభినందనలు. నన్ను సిరిసిల్ల నుంచి మరోమారు అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ప్రజా జీవితంలో కొన్నిసార్లు నిరాశ ఎదురవుతుంది. అన్ని అర్హతలు, సమర్ధత కలిగిన మన్నె క్రిషాంక్ వంటి నేతలకు దురదృష్టవశాత్తూ అవకాశం దక్కలేదు. క్రిషాంక్‌తో పాటు టికెట్ దక్కని ఇతరులకు.. ఇతర పదవులకు ఎన్నికయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రజా సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తాం..’అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
గెలుపు మాత్రమే కేసీఆర్ చిరునామా
ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘సుమారు 40 ఏళ్లుగా ఎక్కడ, ఎప్పుడు పోటీ చేసినా గెలుపు మాత్రమే తన చిరునామాగా మల్చుకున్న మహా నాయకుడు కేసీఆర్. ఎమ్మెల్యేగా ఓడితే రాజకీయ సన్యాసం అని శపథం చేసి నిస్సిగ్గుగా తెల్లారే తుంగలో తొక్కి వెంటనే ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కూడా కేసీఆర్ గురించి మాట్లాడడం విడ్డూరం’అంటూ రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఓటమి భయం అంటే అమేథీ ఎన్నిక అయిన తరువాత జరిగిన మిగతా దశల ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయడమా? (అమేథీలో రాహుల్ ఓటమి తెలిసిందే). బళ్ళారి, అమేథీలో పోటీ చేసిన వ్యక్తి గురించి ఏమంటారు? (సోనియాను ఉద్దేశించి)’అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. వదోదర, వారణాసిలో మోదీ పోటీ ఎందుకు చేశారో బాండ్ పేపర్ వీరుడు (ధర్మపురి అర్వింద్) చెప్పగలరా?’అని ప్రశ్నించారు.
నిబద్ధత కలిగిన నాయకుడు హరీశ్
‘తెలంగాణ ప్రజలకు, బీఆర్‌ఎస్ పార్టీకి సీనియర్ నాయకుడు హరీశ్‌రావు చేసిన సేవలు అనిర్వచనీయం. హరీశ్‌రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మరోవైపు..‘మైనంపల్లికి టికెట్ ఇచ్చాం. పోటీ చేస్తారా? లేదా? అనేది ఆయన ఇష్టం. మేం చేయగలిగింది ఏమీ లేదు’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం!
Published Tue, Aug 22 2023 1:58 AM | Last Updated on Sun, Aug 27 2023 5:35 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment