సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్న గులాబీ పార్టీ
109 ఓట్ల తేడాతో నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఉప ఎన్నిక కౌంటింగ్ చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి 109 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నట్టయింది.
గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన బీఆర్‌ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే గత మార్చి 28న ఉపఎన్నిక జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
నియోజకవర్గంలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా, 1,437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇద్దరు ఎంపీటీసీలు ఓటు వేయలేదు. ఓట్ల లెక్కింపును ఏప్రిల్ 2నే చేపట్టాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 2 తేదీకి వాయిదా పడింది.
మొదటి ప్రాధాన్యతా ఓట్లతోనే..
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. పోలైన ఓట్లలో 1,416 ఓట్లు చెల్లగా.. 21 తిరస్కరణకు గురయ్యాయని అధికారులు నిర్ధారించారు. విజయానికి 709 ఓట్లు అవసరమని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించగా నవీన్‌కుమార్ రెడ్డికి 762 ఓట్లు, జీవన్‌రెడ్డికి 653 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్‌కు ఒక్క ఓటు పోల్ అయ్యాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే కోటాకు మించి 762 ఓట్లు రావడంతో తన సమీప ప్రత్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 109 ఓట్ల మెజారీటతో నవీన్‌రెడ్డి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
పట్టు నిలుపుకున్న గులాబీ పార్టీ
ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా అధిక సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఆ వెంటనే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగడంతో తమకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భా వించింది.
కానీ అధికార పార్టీకి ధీటుగా గులాబీ పార్టీ తమ ప్రజాప్రతినిధులతో క్యాంపులను నిర్వహించి ఓటు బ్యాంకును కాపాడు కోవడంతో పాటు స్థానికంగా పట్టు నిలుపుకుంది.
Comments
Please login to add a commentAdd a comment