![BRS working president KTR is angry on CM - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/21/ktr.jpg.webp?itok=H1qn80I7)
ఢిల్లీ ప్రదక్షిణలే తప్ప రైతులపై కనికరం లేదా?
సీఎంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా, వడగళ్లు ముంచెత్తినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ద్వారా ఆయన సీఎం రేవంత్‌కు పలు ప్రశ్నలు సంధించారు.
సీఎంకు రైతుల కన్నీళ్లు, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదని, ఎన్నికల గోల తప్ప.. కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదని విమర్శించారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా నిరంతరం రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారని ఆక్షేపించారు. పార్టీ ఫిరాయింపులపై పెడుతున్న శ్రద్ధ పంట నష్టం పరిశీలనపై ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
ఢిల్లీలోని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేకుండా పోయిందా? అని వ్యాఖ్యానించారు. ‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం’బాగుపడదు అనే సామెతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై తమ పార్టీ బీఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment