పాపం సినబాబు.. ఉత్త అనుమానాలతో నవ్వులపాలు | CBN In Jail: Nara Lokesh Dirty Politics With Mosquitoes | Sakshi
Sakshi News home page

పాపం సినబాబు.. ఉత్త అనుమానాలతో నవ్వులపాలు

Published Thu, Sep 21 2023 5:12 PM | Last Updated on Thu, Sep 21 2023 7:10 PM

CBN In Jail: Nara Lokesh Dirty Politics With Mosquitoes - Sakshi

‘మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర పన్నుతోంది. జైలులో విపరీతంగా దోమలు🦟 కుడుతున్నాయని చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు.. ఇది టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ వ్యక్తం చేస్తున్న అనుమానాలు. ఓ రిమాండ్‌ ఖైదీ మరణాన్ని తెరపైకి తెచ్చి.. దోమలతో🦟 చంద్రబాబును చంపే కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారాయన. అయితే.. రాజమండ్రి జైళ్ల  శాఖ ఇప్పటికే లోకేష్‌ అనుమానాల్ని నివృత్తి చేసింది. మరోవైపు చినబాబు దోమల రాజకీయంపైనా విమర్శలు, అదే టైంలో సెటైర్లు పేలుతున్నాయి.

🦟సోషల్‌ మీడియాలో నారా లోకేష్‌ తాజా చీప్‌ స్టేట్‌మెంట్‌పై సెటైర్లు పేలుతున్నాయి. స్కిల్‌ స్కాంలో సిల్లీ ఆరోపణలతో నవ్వులపాలవుతున్నారాయన. దోమలతో తన తండ్రిని చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించడమే తర్వాయి.. యెల్లో మీడియా వాటిని హైలైట్‌ చేస్తూ కథనాలు ప్రచురించింది. పైగా ఓ దోపిడీ కేసులో రిమాండ్‌ ఖైదీ మృతిని ప్రముఖంగా ప్రచురించింది. బహుశా.. ఆ దోపిడీ దొంగను చంద్రబాబుతో సమానంగా చూస్తోందేమో!. 

🦟 స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ వ్యవహారంపై ఏపీ ప్రజల్లో మొదటి నుంచి సానుభూతి కనిపించడం లేదు. కనీస సంఘీభావానికి సైతం టీడీపీ కార్యకర్తలు సైతం దూరంగా ఉంటున్నారు. రెండేళ్లపాటు విచారణ తర్వాత పక్కా ఆధారాలతో అరెస్ట్‌ అయ్యాక.. అరెస్ట్‌ అక్రమం అంటున్నారే తప్పా, తాము తప్పు చేయలేదని ఎక్కడా మాట్లాడడం లేదు. పైగా సాంకేతిక కారణాలను చూపిస్తూ.. రాజకీయ కక్షతోనే అరెస్ట్‌ జరిగిందనే లైన్‌ మీదే ఉంటున్నారు.  అంటే.. దొంగ తప్పు ఒప్పుకున్నట్లే కదా అని బలంగా ఫిక్సయిపోయారంతా.  ఇక ఇప్పుడు దోమల పేరుతో ఎలాంటి సానుభూతి రాకపోగా.. లోకేష్‌ నవ్వులపాలవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

🦟దోమా.. దోమా.. మా నాన్నోరి ఎందుకు కుడతావ్‌ అంటే.. మా జోలికి వస్తే కుట్టమా? అందట. కొంపదీసి అధికారంలో ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర చేసినందుకు దోమలు పగబట్టాయా?.. 

లేకుంటే ఆ మధ్య లోకేష్‌ మాట్లాడుతూ.. ఊ.. ఆ అంటే అని అలవాటులో పొరపాటుగా డెంగీ బదులు.. ‘బీప్‌ పదం’ ఒకటి ఉపయోగించాడు.. బహుశా ఆ విషయంలో దోమలు హర్ట్‌ అయ్యి ఉంటాయేమో. అందుకే నారా వారి మీద పగ బట్టాయేమో అనే సెటైర్లు పడుతున్నాయ్‌.

జైళ్ల శాఖ చెప్పినా వినరా?
బాబు భద్రతపై ఎలాంటి ఆందోళన ఆందోళన అవసరం లేదని రాజమండ్రి జైళ్ల శాఖ తెలిపింది. చంద్రబాబు భద్రత గురించి టీడీపీ, ఆ పార్టీ నేత నారా లోకేష్‌ అభ్యంతరాలను ఖండించింది. సెంట్రల్ జైలులో 2,063 మంది ఖైదీలు ఉన్నారు. జైలు లోపల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కోర్టు సూచించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు తాత్కాలిక సూపరింటెండెంట్ రవికిరణ్ స్పందిస్తూ.. జైల్లో దోమల నివారణ కోసం సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామని... ఫాగింగ్ చేస్తున్నామని రవికిరణ్ తెలిపారు. జైల్లో దోమల లార్వాల ఆనవాళ్లేమీ లేవని చెప్పారు.

‘‘రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతి చెందడం పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు బ్యారక్ లో కూడా దోమలు ఉన్నాయి  ఆయన ఆరోగ్యం పై అనుమానాలున్నాయని అంటున్నారు. దోపిడీ కేసులో అరెస్టై జైలుకు వచ్చిన రిమాండ్‌ ఖైదీ సత్యనారాయణ డెంగ్యూతో మృతి చెందాడు. సత్యనారాయణ ఆరో తేదీన జైలుకు వచ్చారు. వచ్చిన రోజే జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ లో ఫీవర్ తో బాధపడుతున్నట్టు తేలింది. వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించాము ...ఈనెల 19న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే మృతి చెందారు. చంద్రబాబుతో పాటు  జైల్లో ఉన్న ఖైదీల అందరి ఆరోగ్య భద్రత చూడడమే మా లక్ష్యం’’ 

అలా అయితే టీడీపీ వాళ్లనే అనుమానించాలి! 
చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం నేతల ఆరోపణలు సరికాదని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి’’ అని ట్వీట్‌ చేశారాయన. అలాగే.. లోకేష్‌, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.  దోమలతో స్లో పాయిజన్‌ అంటూ ఎల్లో మీడియా చేస్తోంది విషప్రచారమని, అసలు తెలుగుదేశం నేతలే ఏదో చేస్తారా అనే అనుమానాల్ని వ్యక్తం చేశారాయన.  

లోకేష్‌ ఢిల్లీ నుంచి ఏపీకి వెళ్లరా?
మరోవైపు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్‌సైతం సానుభూతి కోసం దోమల పేరు చెప్పడం సరికాదని ఎద్దేవా చేశారు.  ఎవరికి భయపడనని చెప్పే చంద్రబాబు, దోమలకు భయపడతారా?. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్ , టిడిపి నేతల నుంచే ఉంది.  చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్‌కు అబ్బినట్టుంది. చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉంది. చంద్రబాబు పై ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారి ఫోన్లను కోర్టు తనిఖీ చేయాలి. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు? అని అనుమానాలు వ్యక్తం చేశారు. 



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement