సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా శాంతి యుతంగా,హింసా రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల యంత్రాగానికి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణ సెన్సిటివిటి,నోడలు అధికారుల నియామకం, నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే మరియు ఫెయిడ్ హాలిడే,అంతర్జాతీయ సరిహద్దు అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి సహచర ఎన్నికల కమిషనర్లతో కలిసి సీఈసీ రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈవోలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ ఎన్నికలు ఏవిధంగా జరుగుతున్నాయని ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కావున రానున్నఎన్నికలను స్వేచ్ఛగా శాంతి యుతంగా హింసా రహితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు పునరుద్ఘాటించారు.ఇప్పటికే మొదటి,రెండవ దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయ్యాయని తెలిపారు.
ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్ వంటివి ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సీఎస్, డీజీపీ,సీఈవోలకు స్పష్టం చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు ఎక్కడైనా తనిఖీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి బృందాలపై జిల్లా యంత్రాంగాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఇసి రాజీవ్ కుమార్ ఆదేశించారు.ముఖ్యంగా పోలింగ్‌కు 48 గంటల ముందు(సైలెంట్ ఫిరియడ్)ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు,మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని అలాంటి చర్యలను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు మోడల్ కోడ్ బృందాలు మరింత నిఘా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికలను సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని విధాలా కట్టుబడి పూర్తి సన్నద్ధమై ఉందని ఈప్రక్రియలో అన్ని రాష్ట్రాలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సిఇసి రాజీవ్ కుమార్ సూచించారు.ఎన్నికల్లో అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేని విధంగా రానున్న ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్ట అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుండి ఇప్పటి వరకు 258 కోట్ల రూపాయలు విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఏపీతో ఐదు రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర సరిహద్దులను కలిగి ఉన్నాయని, రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రశాంత మరియు స్వేచ్ఛాయుత,హింసా రహిత ఎన్నికల నిర్వహణకు అన్నిచర్యలు తీసుకుంటున్నా మని సిఎస్ జవహర్ రెడ్డి వివరించారు.శాంతి భధ్రతల అంశానికి సంబంధించి సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా,ఛతీష్ఘడ్ నుండి కొంత మేర మావోయిస్టుల సమస్య ఉందని ఆ సమస్యను అధిగ మించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు,632 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పని చేస్తున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి సీఈసీకి వివరించారు.
పోలీస్ డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా,ఛతీస్‌గఢ్ రాష్ట్రాల నుండి కొంత వరకు మావోయిస్టుల ప్రాబల్యం ఉందని ఇందుకు సంబంధించి 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు.ఇటీవల మహారాష్ట్రకు 10 కంపెనీల పోలీసు బలగాలను పంపామని వాటిని తిరిగి పంపాలని కోరారు.రాష్ట్రానికి అదనపు బలగాలను పంపాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.
ఈ వీడియో సమావేశంలో సీఈవో ముకేశ్ కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, రజత్ భార్గవ,హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త,అదనపు డీజీపీ ఎస్.బాగ్చి,చీఫ్ కమీషనర్ స్టేట్ టాక్స్ గిరిజా శంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఎస్ఇబి డైరెక్టర్ యం.రవి ప్రకాశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment