ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్‌ గేమ్‌.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. | Chandrababu And Eenadu Ramoji Rao Worst Politics For Votes | Sakshi
Sakshi News home page

ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్‌ గేమ్‌.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..

Published Sat, Nov 26 2022 7:17 AM | Last Updated on Sat, Nov 26 2022 2:31 PM

Chandrababu And Eenadu Ramoji Rao Worst Politics For Votes - Sakshi

ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? ‘ఆక్వా జోన్‌– నాన్‌ ఆక్వా జోన్‌’ అనే పరిమితులు లేకుండా... ఆక్వా రైతులు అందరికీ యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం... అదో మహా ప్రసాదంలా ‘ఈనాడు’ భజంత్రీలు కొడుతూ అచ్చేయటం!!.

అసలు ఆక్వా రైతుల పాలిట విలన్‌ ఎవరు రామోజీ? సీడ్‌ నుంచి ఫీడ్‌ వరకూ... చివరకు రొయ్యల ఎగుమతిదారుల వరకూ ఒకే వర్గానికి చెందిన వారు సిండికేట్‌గా ఏర్పడి... రైతుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ముఠాగా మారటం అబద్ధమా? తన వర్గానికి చెందిన వ్యాపారుల  దారుణాలకు వత్తాసు పలికింది చంద్రబాబు కాదా? ఫీడ్, సీడ్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నా... రొయ్యల ధరలు పతనమవుతున్నా ఏనాడన్నా బాబు హయాంలో ప్రభుత్వం జోక్యం చేసుకుందా? ఇప్పటి మాదిరిగా కనీస మద్దతు ధరలు నిర్ణయించి వ్యాపారుల చేత కొనిపించే సాహసం చేసిందా? అప్పుడెందుకు పెన్నెత్తలేదు రామోజీ మీరు? బాబు అధికారంలో ఉంటే ఎన్ని దారుణాలు జరిగినా మీకు ‘సమ్మ’తమేనా? మరీ ఈ స్థాయి పాత్రికేయమా? 

అసలు ఆక్వా – నాన్‌ ఆక్వా జోన్లను తెచ్చిందే చంద్రబాబు నాయుడు కదా? ఆక్వా జోన్లలోని వారికే విద్యుత్తు, ఇతర సబ్సిడీలని నిబంధనలు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా? అప్పుడెందుకు ఈ నిబంధనలు పెట్టారు... ఇప్పుడెందుకు తొలగిస్తామంటున్నారని అడిగే బాధ్యత ‘ఈనాడు’కు లేదా? తాను అధికారంలో ఉంటూ ఏకంగా నాలుగున్నరేళ్ల పాటు యూనిట్‌ విద్యుత్తు ఆక్వా జోన్ల రైతులకు కూడా రూ.3.86 చొప్పున ఇచ్చింది చంద్రబాబు కాదా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ల్లకు 6 నెలల ముందు దాన్ని యూనిట్‌ రూ.2కు తగ్గించాడు. అది కూడా ఆక్వా జోన్లలోని రైతుల వరకే!!.

ఆ నాలుగున్నరేళ్లూ యూనిట్‌కు రూ.3.86 చొప్పున చెల్లిస్తూ ఆక్వా రైతులు పడ్డ బాధలు ‘ఈనాడు’కు కనిపించలేదు... వినిపించలేదు.  ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు మరి!!. కానీ అప్పట్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తూ ఆక్వా రైతుల వెతలు చూశారు. తాను అధికారంలోకి వస్తే ఆక్వా జోన్లలోని రైతులకు విద్యుత్తు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు.

దీంతో బాబుకు గుబులు పెరిగి... ఎన్నికల ముందు ధర తగ్గించి తన జబ్బలు తానే చరుచుకున్నారు. రామోజీ కూడా శక్తివంచన లేకుండా చంద్రబాబు నిర్ణయాన్ని శ్లాఘించారు. కానీ... ఈ ఎన్నికల గిమ్మిక్కును ఆక్వా  రైతులు అర్థం చేసుకున్నారు. ‘ఇదేం ఖర్మరా బాబూ..’ అనుకునేట్టుగా బాబుకు బుద్ధి చెప్పారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా జోన్లలోని రైతులకు యూనిట్‌ రూ.1.50కే అందించటం మొదలుపెట్టారు వైఎస్‌ జగన్‌. 

జోనింగ్‌ నిబంధనలకు అర్థమేంటి? 
అసలు చంద్రబాబు ఆక్వా జోనింగ్‌ నిబంధనలు తెచ్చిందెందుకు? ఆక్వా సాగును కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలని కదా? అలా కాక ఎక్కడ పడితే అక్కడ కాలువ నీరు పారిన చోటల్లా చేపల  చెరువులు వెలిస్తే మామూలు వ్యవసాయానికి భవిష్యత్తు ఉంటుందా? రాయలసీమలోని కడప జిల్లా మైదుకూరులో సైతం కాలువల వెంబడి  చేపల చెరువులు తవ్వే ప్రయత్నాలు చేశారంటే  ఏమనుకోవాలి?

అలాంటి నాన్‌ –ఆక్వా ప్రాంతాల్లో కూడా రొయ్యల చెరువుల్ని విద్యుత్తు సబ్సిడీలిచ్చి  ప్రోత్సహించాలన్న చంద్రబాబు ఆలోచన ఏ మేరకు సమంజసం? అలా రాయితీలిస్తే కాస్తో కూస్తో లాభసాటి కాబట్టి అంతా అటువైపే వెళతారు. అలా ఆక్వా సాగు చేసిన ప్రాంతాలన్నీ ఉప్పు నీటి కయ్యలుగా మారి మామూలు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి. ఒకవేళ ఎప్పుడైనా... ప్రస్తుతం మాదిరిగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు తలెత్తి ఆక్వా సాగు దెబ్బతింటే... ఆ భూముల్ని మళ్లీ మామూలు సాగులోకి తీసుకురావటం అసాధ్యం. ఆ ఉద్దేశంతోనే జోనింగ్‌–నాన్‌ జోనింగ్‌ నిబంధనలొచ్చాయని ఎవరైనా చెబుతారు. మరిప్పుడు చంద్రబాబుకు ఏమైంది? రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నేను అధికారంలోకి వస్తే చాలన్న దుర్బుద్ధి స్పష్టంకావటం లేదూ?  ఈయన్ని... ఈయన తానా అంటే... తందానా అంటూ తయారయ్యే రామోజీరావును ఏం చెయ్యాలి? 

అంతా బాబు మనుషులు కాదా? 
ఫీడ్‌ తయారు చేసే కంపెనీలూ వారివే. రొయ్యల్ని ఎగుమతి చేసే కంపెనీలూ వారివే. అంటే రైతుకు పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించేదీ వారే... ఉత్పత్తి ధరను నిర్ణయించేదీ వారే. వీళ్లు ఈ స్థాయిలో ముఠాలా మారి అన్నీ శాసించినపుడు గత ప్రభుత్వం ఏం చేసింది? ఆక్వా కార్య కలాపాల్లోని అవంతి ఫీడ్స్, దేవి సీఫుడ్స్, దేవి ఫిషరీస్, నెక్కంటి సీఫుడ్స్, సంధ్య ఆక్వా, గ్రోవెల్‌ ఫీడ్స్, వాటర్‌ బేస్‌ లిమిటెడ్‌... ఇవన్నీ ఎవరివి? చంద్రబాబు సన్నిహితులవి కావా? అసలు రాష్ట్రంలో వనామీ రొయ్యల పెంపకం 2009లో మొదలైనపుడు... 2014 వరకూ నాటి ప్రభుత్వాలు 2–3 సార్లు రేట్లు పెంచాయి.

కిలో రేటు దాదాపుగా రూ.20 వరకూ పెరిగింది. మరి 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు కేవలం 70 పైసలు మాత్రమే ఎందుకు పెంచారు? ఎందుకు రైతులకు సరైన ధర రాకుండా వారి పొట్టగొట్టారు? 2019లో ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటిదాకా దాదాపు కిలోకు రూ.27 వరకూ పెరగటం అబద్ధమా? కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అండగా నిలవటం అబద్ధమా? ఈ నిజాలు ఎన్నడూ ఎందుకు చెప్పరు రామోజీ? బాబు అబద్ధాలను మాత్రమే అచ్చేసే మీదీ ఒక పత్రికేనంటారా? 

ప్రతి ఏటా దోచుకోవటం... పచ్చి నిజం 
ఆక్వా ఎగుమతిదారుల మెడపై ప్రభుత్వం కత్తిపెట్టిందంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు... తన హయాంలో వారందరికీ ఇష్టారీతిన దోచుకోవటానికి లైసెన్స్‌ ఇచ్చారనే చెప్పాలి. ఏటా తొలిసారి రొయ్యల పంట చేతికొచ్చినపుడు ఏ రైతూ ఎక్కువ ధరను కళ్ల జూసేవాడు కాదు. 200 కౌంట్‌ ధర రూ.170–180 రూపాయలకు మించి పలికేది కాదు. ఎందుకంటే కంపెనీలన్నీ సిండికేట్‌గా ఏర్పడి ఈ మాయాజాలాన్ని కొనసాగించేవి.

దానికి బాబు, రామోజీల అండ ఎటూ ఉంది. ‘ఈనాడు’ సైతం వీరి పక్షమే కనక... రైతుల వెతలను రాస్తే ఒట్టు!. అలా 170–180కి వీళ్లంతా రైతుల దగ్గర కొనుగోలు చేసిన తరవాత... అకస్మాత్తుగా ధర పెరిగిపోయేది. కానీ అలా పెరిగేటప్పటికి రైతుల చేతిలో రొయ్యలుండేవి కావు. ఇలాంటి పరిస్థితులుండకూడదనే చట్ట సవరణలు చేసి మరీ ఈ  ప్రభుత్వం రైతుల్లో భరోసా కల్పించింది. అదే రామోజీరావు దృష్టిలో పెద్ద నేరమైపోయింది. ఆక్వా రైతుల గురించి ‘ఈనాడు’ రాసే ప్రతి రాతలో ప్రభుత్వంపై విషం చిమ్మటానికి... ఈ సిండికేట్లను బ్రేక్‌ చేయటమన్నదే ప్రధాన కారణమని వేరే చెప్పాల్సిన పని లేదు కూడా. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈ సిండికేట్లు దోచుకోవటానికి చంద్రబాబు సాయపడితే... ఎన్నికలు వచ్చినపుడు వీళ్లంతా కలిసి చంద్రబాబుకు ఆర్థికంగా సాయపడతారు. అదీ వీళ్ల లెక్క. అందుకే వీళ్లకు సాధారణ రైతులంటే లెక్క ఉండదు.

ఇక్కడ గమనించాల్సిందొకటుంది. బాబు హయాంలో ముడిపదార్థాల ధరలు తగ్గినా....
ఫీడ్‌పై మాత్రం కిలోకు రూ.7 అధికంగా దోచుకున్నారు. కానీ బాబు పట్టించుకుంటే ఒట్టు!!. అదే ఈ ప్రభుత్వ హయాంలోకి వచ్చేసరికి ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఇదే కారణంతో ఈ ఏడాది జూన్‌ నుంచి సెపె్టంబరు మధ్య 6 సార్లు కంపెనీలు ఫీడ్‌ ధరలు పెంచాయి. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుని 3 సార్లు తగ్గించింది. అంతేకాకుండా ముగ్గురు సీనియర్‌ మంత్రులు, సీనియర్‌ అధికారులతో ఆక్వా సాధికార కమిటీ ఏర్పాటయింది.
ఈ కమిటీ అందరితో చర్చించి... కిలోకు రూ.2.60 చొప్పున ఫీడ్‌ ధరలు తగ్గించింది. ఇలా ఇష్టానుసారం ఫీడ్‌ ధరలు పెంచకుండా ఏకంగా చట్టాన్ని సైతం సవరించింది ప్రభుత్వం. అలా.. ఫీడ్‌ ధరలను నియంత్రించే వ్యవస్థను తేవటంతో పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు దాదాపు రూ.10 లక్షల మేర ప్రయోజనం కలిగింది. కాకపోతే ఇలాంటి నిజాలను ‘ఈనాడు’ ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే ఇవి బాబు చేయలేని... కనీసం చేయాలనుకోని పనులు కాబట్టి!.

జగన్‌ హామీ... బాబు జీవో.. బకాయిలు చెల్లించిన జగన్‌!! 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నపుడు... తాను అధికారంలోకి వస్తే  ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో కలత చెందిన బాబు... అప్పటికప్పుడు ఆక్వా జోన్లలోని రైతులకు రూ.2కే యూనిట్‌ ఇస్తానని జీవో ఇచ్చారు. అది కూడా 2018 సెప్టెంబర్లో. అంటే 6 నెలల్లో ఎన్నికలున్నాయనగా!!. చిత్రమేంటంటే జీవో ఇచ్చినా ఆ మేరకు సబ్సిడీ నిధుల్ని విద్యుత్తు కంపెనీలకు మాత్రం ఇవ్వలేదు బాబు. అధికారంలోకి వచి్చన వెంటనే... 2019 జూలై 2 నుంచి వీరికి విద్యుత్తు యూనిట్‌ రూ.1.50కే ఇస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ జీవో ఇచ్చారు. ఈ మూడున్నరేళ్లలో ఏకంగా రూ.2,687.47 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ రూపంలో ఖర్చు చేశారు. బాబు చెల్లించకుండా వదిలేసిన బకాయిలనూ చెల్లించారు. అదీ చిత్తశుద్ధి అంటే.  

ధరలెందుకు తగ్గాయి?  అసలిప్పుడు రొయ్యల ధరలెందుకు
పతనమయ్యాయి? ప్రధానంగా చైనా, అమెరికాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈక్వెడార్‌ లాంటి చిన్న దేశం నాణ్యమైన రొయ్యల్ని ఉత్పత్తి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో సవాల్‌ విసిరింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌ లేక... ధరలు పతనమయ్యాయి. ఇక దేశీయంగా పరిస్థితులెలా ఉన్నా రాష్ట్రం మాత్రం నాణ్యమైన విద్యుత్తును సబ్సిడీ ధరకే అందించటంతో ఇక్కడ ఉత్పత్తి పెరిగింది. ఎగుమతిలో పోటీ పెరిగింది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆక్వా పరిశ్రమ దెబ్బతినకుండా దానికి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సాహసమే చేసింది. 

మత్స్య రంగంలో ఏపీ ఉత్తమ రాష్ట్రం.. కేంద్రం కితాబు
మత్స్య రంగానికి సంబంధించి అన్ని అంశాలలో ఆంధ్రప్రదేశ్‌ను భారత ప్రభుత్వం 2021లో ఉత్తమ రాష్ట్రంగా గుర్తించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అదే ఏడాది నవంబర్‌ 21న బహుమతి ప్రదానం చేసింది. మత్స్య ఉత్పత్తిలో రాష్ట్రం.. దేశంలోనే 30 శాతం వాటా కలిగి అగ్రగామిగా ఉంది. స్థూల విలువ జోడింపులో 2014–15లో 4.6 శాతంగా ఉన్న వాటా, 2020–21 నాటికి 9 శాతానికి అభివృద్ధి చెందింది.

మొత్తం దేశ సముద్ర ఆహార ఎగుమతుల విలువలో రాష్ట్ర వాటా 2014–15 లో 28 శాతం ఉండగా, 2020–21 నాటికి అది 35 శాతానికి పెరిగింది. ఎగుమతుల విలువ 2014–15లో రూ.9,671 కోట్లు ఉండగా, 2020–21 నాటికి అది రూ. 20,019 కోట్లకు పెరిగింది. 2014–15లో 19.78 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్న మత్స్య ఉత్పత్తి.. 2021–22లో ఏకంగా 48.13 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. ఈ వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, మత్స్య రంగం వృద్ధి చెందలేదని చెప్పడం ఎవరి బాగు కోసం?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement