
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం రెండు విడతలు సుదీర్ఘంగా చర్చలు జరిపినా సీట్లపై కొలిక్కి రాలేదు. 3 గంటలు చొప్పున మంతనాలు జరిపినా సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఆదివారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తిరిగి వెళ్లిపోయి చీకటి పడ్డాక రాత్రి మరోసారి చంద్రబాబు ఇంటికి వచ్చి గంటల తరబడి చర్చలు జరిపారు.
పవన్ కళ్యాణ్ 50కిపైగా సీట్లు అడుగుతుండగా చంద్రబాబు ఎటూ తేల్చకుండా ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. తమకు కేటాయించే సీట్ల గురించి తేల్చాలని, కనీసం కొన్ని సీట్లనైనా ప్రకటిస్తే బాగుంటుందని పవన్ కోరినా అప్పుడే ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు దాటవేసినట్లు తెలిసింది. జనసేనకు సీట్లు ఇవ్వడం వల్ల తమ పార్టీ నేతలు ఆందోళనకు దిగే అవకాశం ఉందని, ముందు వారికి నచ్చజెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అలాంటి వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
‘ఫ్యాన్’ ఫుల్ స్పీడ్
ముఖ్యమంత్రి జగన్ దూకుడుగా ముందుకెళుతున్నా తాము ఏమీ తేల్చుకోలేకపోవడంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. జగన్ ఒకవైపు అభ్యర్థుల ఎంపికను వేగంగా పూర్తి చేస్తున్నా టీడీపీ–జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల గురించి కనీసం స్పష్టత లేకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో ఇబ్బంది నెలకొందనే విషయం చర్చకు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’ సభలకు జనం భారీగా వస్తుండడాన్ని పవన్ ప్రస్తావించారు. భీమిలి సభ విజయవంతమవడం, ఆ తర్వాత నిర్వహించిన దెందులూరు సభకు అంతకు మించిన స్పందన వచ్చిందనే అంశం చర్చకు వచ్చింది.
పరువు కాపాడుకునేందుకు..
అభ్యర్థుల ఎంపికలో దూకుడుతోపాటు సిద్ధం సభలతో వైఎస్సార్ సీపీ మంచి ఊపు మీద ఉందని, అదే సమయంలో తమ వైపు ఆ జోరు లేకపోవడం ఇబ్బంది కలిగిస్తుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీంతో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభ స్థాయిలో తాము కూడా ఒక సభను ఉమ్మడిగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
అమరావతిలో సభ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరిగింది. చంద్రబాబు సభలకు జనం మొహం చాటేస్తుండటంతో పవన్ కళ్యాణ్‌ను రప్పించి టీడీపీ – జనసేన కలిసి ఉమ్మడి సభ నిర్వహించాలని నిర్ణయించారు. ‘రా కదలిరా’ సభలన్నీ పేలవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో జనసేనతో కలసి ఉమ్మడి సభలపై ప్రణాళిక రూపొందించిన చంద్రబాబు సమావేశంలో దానిపై చర్చించారు.
బీజేపీ స్పష్టత కోసం..
పొత్తుపై బీజేపీ స్పష్టత ఇచ్చే వరకు వేచి ఉండక తప్పదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఆ పార్టీ అగ్ర నేతలతో భేటీకి పవన్‌కళ్యాణ్ ప్రయత్నిస్తున్నా అటు నుంచి స్పందన లేదని ఇరువురు చర్చించుకున్నట్లు తెలిసింది. కమలనాథులు తమ నిర్ణయం ప్రకటించే వరకు సీట్ల సర్దుబాటుపై తేలడం కష్టమనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ ముఖ్య నేతలను కలవడానికి ప్రయత్నాలు కొనసాగించాలని, 10వతేదీలోపు ఎలాగైనా కలిసేలా ప్రయత్నించాలని పవన్‌కు చంద్రబాబు సూచించారు.